WhatsApp Governance
WhatsApp Governance: రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్) కు ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఉండవల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌరసేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులో తీసుకురానున్నారు. అయితే, దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రభుత్వం ఈ వాట్సప్ సేవలను అందుబాటులోకి తెస్తుంది. వాట్సప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ విధానంతోపాటు ప్రభుత్వ సమాచారం కూడా వాట్సాప్ ద్వారా పంపేలా ఏర్పాట్లు చేశారు.
వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గతేడాది మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తొలిదశలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖలకు సంబంధించి మొత్తం 161 సేవలు తొలిదశలో వాట్సప్ ద్వారా ప్రభుత్వం అందించనుంది. ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా టికెట్ బుకింగ్ తో పాటు.. రెవెన్యూశాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు కూడా సులభవంగా పొందొచ్చు.
Also Read: Harish Kumar Gupta : ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
ఫిర్యాదులు కూడా చేయొచ్చు..
వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటిస్తుంది. ఆ ఎకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ వాట్సప్ ఖాతా ద్వారా ప్రభుత్వం ఒకేసారి కోట్ల మందికి తమ సందేశాలను అందిస్తుంది. అయితే, ప్రభుత్వం ప్రకటించే వాట్సప్ నెంబర్ కు ప్రజలు వినతులు, ఫిర్యాదులుకూడా చేయొచ్చు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రభుత్వం ప్రకటించిన వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నవంబర్, చిరునామా తదితర వివరాలు పొందుపర్చాలి. వారి ఫిర్యాదును టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. దాని ఆధారంగా మీరు చేసిన ఫిర్యాదు పరిష్కారం ఎంత వరకు వచ్చింది..? ఎవరి వద్ద ఉంది.. అనేది పౌరులు తెలుసుకోవచ్చు.
సర్టిఫికెట్లను కూడా పొందొచ్చు..
ఏపీలో ప్రారంభించే వాట్సప్ సేవల ద్వారా పలు రకాల సర్టిఫికెట్లను కూడా పొందొచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ సర్టిఫికెట్ ఇలా.. వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందొచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాదు.. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి, ట్రేడ్ లైసెన్సులు వంటివి అధికారిక వాట్సాప్ ద్వారా పొందొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లతో పాటు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, బస్సు ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్ బ్యాక్ తదితర సేవలు నేరుగా వాట్సాప్ సేవల ద్వారా పొందవచ్చు.