ప్రాజెక్టులపై జగన్‌కు అవగాహన లేదు, కాంట్రాక్టర్లకు రూ.18వేల కోట్లు బకాయిలు పెట్టారు- మంత్రి నిమ్మల

డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.

Nimmala Rama Naidu : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టులపై జగన్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ నుండి వెలిగొండ ప్రాజెక్ట్ వరకు అన్నీ విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు. ఇరిగేషన్ శాఖను జగన్ 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ను యుద్ద ప్రాతిదికన పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్ల సమయం పడుతుందని, 4వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని మంత్రి నిమ్మల వెల్లడించారు.

”వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ లోని మట్టిని ఒకటవ టన్నెల్ చివరి భాగంలో వేశారు. వీటిని తొలగించాలి. రెండవ టన్నెల్ 12వ కిలోమీటర్ వద్ద బోరింగ్ మిషన్ (టీబీఎం) చెడిపోయింది. దాన్ని మూడేళ్లుగా బయటకు తీసుకురాలేదు. హెడ్ రెగులేటర్ పనులు పూర్తి కాలేదు. ఒకటి, రెండు టన్నెల్ నీరు ఫీడర్ కెనాల్ ద్వారా వెళ్లాలి. ఫీడర్ కెనాల్స్ వర్షాలకు గండ్లు పడ్డాయి. ఒకటవ టన్నెల్ లో 3 వేల క్యూసెక్కులు, రెండవ టన్నెల్ లో 8500 క్యూసెక్కులు మొత్త 11500 క్యూసెక్కులు నీరు వెళతాయి. ఫీడర్ కెనాల్ లైనింగ్ పూర్తి కాకుండా నీరు వదిలితే గ్రామాల్లోకి వెళ్తుంది.

నల్లమల సాగర్ కెపాసిటీ 53 టీఎంసీలు కాగా కనీసం అర టీఎంసీల నీటిని కూడా అందులో నిలువ చేసే పరిస్థితి లేదు. నల్లమల సాగర్ కు 11 ముంపు గ్రామాలు ఉండగా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. నిర్వాసితులకు 1100 కోట్లు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ పనులన్నీ చేయకుండా వెలిగొండ ప్రాజెక్ట్ కు నీరు ఎలా విడుదల చేయాలి? జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర జలవనరులశాఖ విడుదల చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ అన్ అప్రూవల్ ప్రాజెక్ట్ గా ఉంది. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి.

గత చంద్రబాబు పాలనలో ఇరిగేషన్ శాఖకు 7 లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టి 68 వేల కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ 12 లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టి 32 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించి అందులోనూ సగం మింగేశారు. సోమశిల ప్రాజెక్ట్ రోప్స్ తుప్పు పట్టాయి. షట్టర్స్ దారుణంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండితే డోర్లు కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ డోర్లు కొట్టుకుపోవడంతో 34మంది చనిపోయారు.

జగన్ కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు. డయాఫ్రం వాల్ భూమి లోపల వుంటుంది. అంబటి రాంబాబు.. ప్రతి ప్రాజెక్ట్ కు డయాఫ్రం వాల్ ఉంటుందంటారు. ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు” అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Also Read : ఆ అధికారులు అందరూ జైలుకు వెళ్లడం ఖాయం : బుద్ధ వెంకన్న

ట్రెండింగ్ వార్తలు