3 రాజధానులు మంచిదే : రాజధానితో 10శాతం మంది ప్రజలకే పని

ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని

  • Publish Date - January 1, 2020 / 02:41 PM IST

ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని

ఏపీ రాజధాని అంశంపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానుల ఆలోచన మంచిదే అని ఆయన అన్నారు. వాస్తవంగా రాజధానితో 10శాతం మంది ప్రజలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. 10శాతం మందికే రాజధానితో అవసరం ఉంటుందన్నారు. సచివాలయం, కోర్టులతోనూ 10శాతం మంది ప్రజలకే పని ఉంటుదన్నారు. మిగతా 90శాతం మందికి కేపిటల్ తో పెద్దగా అవసరం కానీ, పని కానీ,  ప్రయోజనం కానీ ఉండదని అభిప్రాయపడ్డారు. కాబట్టి.. రాజధాని ఎక్కడున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

హైదరాబాద్ ని మాత్రమే అభివృద్ధి చేశారు:
ఉమ్మడి రాష్ట్రంలో 90శాతం మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారని గుర్తు చేసిన మంత్రి.. వారంతా అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టిసారించ లేదని… దీంతో సమస్య వచ్చిందన్నారు. సీమ నుంచి వచ్చిన సీఎంలందరూ హైదరాబాద్ నే అభివృద్ధి చేశారని చెప్పారు. ఇప్పుడు జగన్ ప్రతిపాదనతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులే వ్యతిరేకిస్తున్నారు:
రాజధాని అంశంపై కమిటీలు నివేదికలు ఇచ్చాక వాటిపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు. రాయలసీమ వాసులంతా సీఎంకు ధన్యవాదాలు తెలపాలన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి చెప్పారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే ఉత్తరాంధ్ర వారికి ఇబ్బందని, అలాగే విశాఖలో సచివాలయం ఉంటే రాయలసీమ వాసులకు ఇబ్బందని మంత్రి అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ నిర్ణయం తప్పదన్నారు.

అమరావతి రాజధానా? గ్రామమా? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని ఆయన అన్నారు. రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్లీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాజధాని రైతుల భూములను ఎవరూ లాక్కుని వెళ్లటం లేదని, వారు నిశ్చింతగా ఉండొచ్చని మంత్రి అన్న సంగతి తెలిసిందే.

అసెంబ్లీలో చర్చించి ఫైనల్ నిర్ణయం:
బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక జనవరి 3న వస్తుందని.. ఆ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అభివృద్ది చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ది చేయడం కాకుండా ఇతర ప్రాంతాలను కూడా వాటితో సమానంగా తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నామన్నారు. వారు బాగుపడటం మీకు ఇష్టం లేదా అని అమరావతి ప్రాంత ప్రజలను మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ద్వారా రాష్ట్రమంతటా సమాన అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతులకు న్యాయం చేయాలనే సీఎం చూస్తున్నారని వివరించారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సేవలు చంద్రబాబు కూడా గతంలో చాలా సార్లు తీసుకున్నారని మంత్రి గుర్తుచేశారు.

రాజధాని రైతులకు న్యాయం చేస్తాం:
పదేళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వాడుకునే అవకాశమున్నా వదిలేసి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మోసం చేశారని మంత్రి ఆరోపించారు. రాజధానికి పేరుతో వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి భూమిలిచ్చిన రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరని… మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, రాజధాని మార్పుపై 15 రోజులుగా అమరావతి ప్రాంతంలో రైతులు, స్థానికులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.