10tv కథనానికి స్పందన : డబ్బులు ఇవ్వొద్దు..ఉచితంగా ఇళ్ల స్థలాలు : మంత్రి శ్రీరంగనాథ రాజు

  • Publish Date - June 5, 2020 / 06:07 AM IST

10tv కథనానికి ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీరంగనాథ రాజు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనికి సంబందించి ఇప్పటికే ఒకరిపై కేసు నమోదు అయ్యిందన్నారు. ఎవరు డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలకు ఎవరూ డబ్బులు కట్టవద్దని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు చెప్పారు. 

ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను రెండ్రోజుల క్రితం 10tv బయటపెట్టింది.  లబ్ధిదారుల నుంచి వైసీపీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్న దందాను 10tv వెలుగులోకి తెచ్చింది. ఒక లబ్దిదారుడి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఉదంతాన్ని నిఘా కెమెరా చిత్రీకరించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పేదల నుంచి వైసీపీ నేతలు అందినకాడికి దండుకుంటున్నారు. ఇళ్ల స్థలం కావాలంటే కాసులు కురిపించాల్సిందేనంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

వంద, కాదు వెయ్యి కాదు 20 వేల నుంచి లక్షన్నర దాకా కట్టించుకుంటున్నారు. ఉచిత స్థలానికి డబ్బులు ఎందుకు కట్టాలి అని ప్రశ్నిస్తే… ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదని డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. ఇదంతా 10tv కెమెరాలో రికార్డైంది. సొంత ఇంటి స్థలం కోసం ఎన్నో కలలు కన్న కొందరు అప్పులు చేసి కడుతుంటే… డబ్బు కట్టలేని పేదలకు ఇంటి స్థలం ఇచ్చేది లేదంటూ అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బు వసూళ్లకు కూడా తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు అక్రమార్కులు.

ప్రభుత్వం స్థలాలు కొనడానికి ఇచ్చిన నిధులు చాలడం లేదని… స్థలాల్ని బాగు చేయడానికి అయ్యే ఖర్చును లబ్ధిదారులే భరించాలంటూ వసూళ్లు చేపట్టారు. తణుకు మండలంలోని దువ్వ గ్రామంలో 714 మందికి ఇళ్ల స్థలాల కోసం 34 మంది రైతుల దగ్గర 20 ఎకరాలు సేకరించారు. స్థల సేకరణ, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంటి స్థలం ఇవ్వాలి అంటే ఒక్కొక్క  లబ్దిదారుడు రూ. 30 వేలు కట్టాలని స్థానిక వైసీపీ నాయకులు డిమాండ్‌ వేయడంతో గ్రామంలోని అనేక మంది డబ్బులు కట్టేశారు. వీరిలో కొందరు అప్పులు చేస్తే… ఇంకొందరు భార్యల మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి వైసీపీ నేతలు అడిగినంతా సమర్పించుకున్నామని వాపోయారు. మొత్తానికి ఈ అక్రమాలపై ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్లు మంత్రి ప్రకటించారు. 

Read: ఒంగోలులో కంపించిన భూమి.. తీవ్రత 4.7గా నమోదు