Minister Sucharita’s response on Nandyal family suicide : కర్నూలు జిల్లా నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్‌పై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సీఐ సోమశేఖర్‌రెడ్డి కారణమన్న ఆరోపణలతో… ఆయనపై వేటేశారు.
సీఐ సోమశేఖర్‌రెడ్డి వల్లే చనిపోతున్నామంటూ అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ వీడియో బయటకు రావడం పెను సంచలనంగా మారింది. అబ్దుల్‌సలాం ఫ్యామిలీ సెల్ఫీ వీడియోను 10టీవీ ప్రసారం చేయడంతో… ఆ కథనాలకు హోంమంత్రి సుచరిత తీవ్రంగా స్పందించారు. సీఐ సోమశేఖర్‌రెడ్డిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే నలుగురి ఆత్మహత్యపై విచారణకు ఆదేశించారు. దీంతో ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేసేందుకు ఐజీ శంకర్‌బత్ర బాగ్జితో పాటు ఐపీఎస్ ఆరిఫ్ హఫీజ్‌ను హోంశాఖ నియమించింది.
తమ మృతికి కారణం పోలీసులే కారణమంటూ అబ్దుల్‌సలాం కుటుంబం ఆరోపించింది. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో సీఐ సోమశేఖర్‌రెడ్డిపై ఆరోపణలు కురిపించింది. తాము ఏ తప్పు చేయలేదని.. దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదంటూ అబ్దుల్ సలాం తీవ్ర ఆవేదనతో తెలిపాడు. టార్చర్ భరించలేకపోతున్నానని.. తమకు సాయం చేసే వారు ఎవరూ లేరని.. మా చావుతో అయిన మీకు మనశ్శాంతి కలుగుతుందని అనుకుంటున్నా సార్ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.