MLA alla ramakrishna reddy return to ysr congress party
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి తిరిగి వచ్చారు. ఆయన మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. వైసీపీ కండువాతో ఆర్కేను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఆర్కే వెంట ఆయన సోదరుడు అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. వైసీపీలో ఆర్కేకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే.
ఫలించిన విజయసాయి చర్చలు
మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంతగూటికి తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి, తన సోదరుడు అయోధ్యరామిరెడ్డితో ఆయన మంతనాలు జరిపారు. చర్చలు ఫలించడంతో ఈరోజు సీఎం జగన్ సమక్షంలో మరోసారి వైసీపీ కండువా కప్పుకున్నారు.
ముఖ్య అనుచరులతో ఆర్కే భేటీ
సీఎం జగన్ తో భేటీకి ముందు మంగళగిరిలోని తన కార్యాలయంలో ముఖ్య అనుచరులతో ఆర్కే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి పార్టీలో పని చేస్తానని చెప్పారు. కాగా, ఆర్కే తన వాట్సాప్ డీపీగా వైఎస్ జగన్ ఫొటో పెట్టుకోవడం విశేషం.
Also Read: మీసం మెలేసి.. సై అంటే సై.. జగన్, చంద్రబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం