అడిగేవాడు లేడనుకున్నారా? వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్!

తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు బాలకృష్ణ. అడిగేవాడు లేడనుకున్నారా? బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరని, ఖచ్చితంగా బదులు తీర్చుకొని తీరతామని స్పష్టం చేశారు.

తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ.. ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే.. మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. రాష్ట్రంలో వైసీపీ పాలన దారుణంగా ఉందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువ అయ్యాయని, మమ్మల్ని బెదిరిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇది కేవలం టీడీపీకే కాదని.. సమాజానికే ప్రమాదమని బాలకృష్ణ అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం పదేళ్లు కాదు.. వందేళ్లు వెనక్కి వెళ్లిందని.. ఉపాది లేక యువత.. పరిశ్రమలు రాక ఆర్థికంగా.. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో అనేకమంది గంజాయి, మద్యం లాంటి వాటి మత్తులోకి జారుకుంటున్నారని అన్నారు. హిందూపురంలో టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదని, తీవ్రమైన పరిణామాలు చూడవలసిన పరిస్థితి వస్తుందని, వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ప్రజలు మాత్రం టీడీపీవైపే ఉన్నారని బాలకృష్ణ అన్నారు.