సీఎం జగన్ ప్రారంభించిన దిశ పీఎస్ లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా

  • Publish Date - February 10, 2020 / 09:33 AM IST

సోషల్ మీడియాలో తనపై అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా

సోషల్ మీడియాలో తనపై అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన తొలి దిశ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) రాజమండ్రి దిశ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన ఎమ్మెల్యే.. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. భవానీకి మద్దతుగా వంగలపూడి అనిత, నేతలు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని భవానీ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని గతంలోనే అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఓ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

అసెంబ్లీలో మద్యపాన నిషేధంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారని ఎమ్మెల్యే భవానీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ పోస్టుల పెట్టిన వారిపై చర్యలు తీసుకొని.. తన నుంచే దిశ చట్టాన్ని ప్రారంభించాలని ఆమె అసెంబ్లీలో కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దిశా చట్టం ఇంకా అమల్లోకి రాలేదని డీఎస్పీ చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దిశ పీఎస్ లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారని.. దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం జగన్ అబద్ధపు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మండిపడ్డారు.

* సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్న శాడిస్టులు
* సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత, అసభ్యకర కామెంట్లు
* ఎమ్మెల్యే, హీరోయిన్, యాంకర్.. ఎవరైనా తప్పని వేధింపులు
* లేడీ సెలబ్రిటీలను మరింతగా వేధిస్తున్న ట్రోలర్లు

* సెలబ్రిటీల ఫొటోలపై బూతు పోస్టులతో పైశాచిక ఆనందం
* అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యం స్పీచ్ పై వెకిలి కామెంట్లు
* యాంకర్ అనసూయ గురించి అసభ్యకర పోస్టులు