Vasantha Krishna Prasad : మార్పు ఎఫెక్ట్.. రగిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎన్నికల్లో పోటీపై సంచలన నిర్ణయం..!

ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్‌.

Vasantha Venkata Krishna Prasad Sensational Decision (Photo : Google)

ఎమ్మెల్యేల మార్పు ఎఫెక్ట్‌తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ రగిలిపోతున్నారట. తనను సిట్టింగ్‌ స్థానం నుంచి మార్చడాన్ని జీర్ణించుకోలేని కృష్ణప్రసాద్‌.. సీఎంతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని చెబుతున్నారు. మంత్రి జోగి రమేశ్‌తో విభేదాలకు తోడు.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పించేలా ప్లాన్‌ చేయడంపై ఎమ్మెల్యే అసంతృప్తికి గురైనట్లు చెబుతన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెబుతూ వైసీపీ అధిష్టానానికి షాక్‌ ఇస్తున్నారంటున్నారు.

కృష్ణా జిల్లాలో మార్పు మంటలు..
కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల మార్పు మంట పుట్టిస్తోంది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌.. మార్పు ప్రచారాన్ని ఖండిస్తూ తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటిస్తుంటే.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తనను మార్చుతారనే ప్రచారంతో ఏకంగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత దేవినేని ఉమాపై పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్‌ను విజయవాడ ఎంపీగా పంపాలని ప్రతిపాదిస్తోంది వైసీపీ అధిష్టానం. ఐతే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే.. ఏకంగా సీఎం జగన్‌ను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదనే ప్రచారం హీట్‌ పుట్టిస్తోంది.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

కృష్ణ ప్రసాద్ రాకతో పెడనకు మారిన మంత్రి..
2018లో వైసీపీలో చేరిన కృష్ణప్రసాద్‌.. 2019లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నేత దేవినేని ఉమాను ఓడించి రికార్డు సృష్టించారు. ఎన్నికల ముందువరకు ఈ సీటు నుంచి పోటీ చేస్తారని భావించినా ప్రస్తుత మంత్రి జోగి రమేశ్‌.. కృష్ణప్రసాద్‌ రాకతో పెడనకు మారాల్సి వచ్చింది.

మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు..
ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కృష్ణప్రసాద్‌కు.. మంత్రి జోగికి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. మంత్రి జోగి రమేశ్‌కి మైలవరం సొంత నియోజకవర్గం కావడంతోపాటు.. భారీగా అనుచరగణం ఉండటంతో నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారు. దీనిని ఇష్టపడని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌.. అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి అలక వహించారు. ఐతే హైకమాండ్‌ జోక్యం చేసుకుని మంత్రిని వెనక్కి తగ్గించడంతో కొద్ది కాలం నుంచి పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ యాక్టివ్‌ అయ్యారు కృష్ణప్రసాద్‌.

మంత్రి కోసం నన్ను మారుస్తారా? అంటూ సీరియస్..
ఇక ఎమ్మెల్యేల మార్పు ప్రచారం.. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేశ్‌ మైలవరంపై ఆసక్తి చూపుతుండటంతో కృష్ణప్రసాద్‌ను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదిస్తోంది వైసీపీ. దీంతో షాక్‌ తిన్న ఎమ్మెల్యే.. మంత్రి కోసం తనను విజయవాడ పార్లమెంట్‌కు పంపాలనే ప్రతిపాదనను తెరపైకి తేవడాన్ని జీర్ణించుకోలేక.. తాను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచీ పోటీ చేయనని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీఎం జగన్‌తో మీటింగ్‌ కూడా రానన్నట్లు చెబుతున్నారు.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

తాను అందుబాటులో లేనని.. మరో రోజు వచ్చి కలుస్తానని ఎమ్మెల్యే సమాచారం ఇవ్వడంతో వైసీపీ హైకమాండ్‌ షాక్‌ తిన్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్‌.