Pawan Kalyan : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతాం అంటూ ప్రతిజ్ఞ చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ లో ఈ లక్షణాలు ఉన్నాయా?

Pawan Kalyan : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

Pawan Kalyan Strategy

రాజకీయాల్లో వ్యూహాలు ముఖ్యం. పార్టీ నడపటం, ఎన్నికల్లో గెలవడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. క్షేత్రస్థాయి నుంచి బలం ఉండాలి. పోల్ మేనేజ్ మెంట్ తెలియాలి. పుష్కలమైన ఆర్థిక వనరులూ ఉండాలి. అన్నింటికి మించి ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలకు ప్రత్యామ్నాయం తామే అనే భావన ప్రజల్లో కల్పించాలి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతాం అంటూ ప్రతిజ్ఞ చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ లో ఈ లక్షణాలు ఉన్నాయా? నిన్న కాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి?

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది పవన్ కల్యాణ్ లక్ష్యం. ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు. తాను కోరుకున్న పథకాలను, ప్రజలకు చేయాలనుకున్న మేలును ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఉండేలా చూస్తారు. ఇంతవరకు పవన్ రైటే. మరి ఎన్నికల్లో తన పార్టీకి వస్తున్న ఓట్లే పవన్ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయా? అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

ఇంతటి మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్న పవన్ కు ఏదో సమస్య వెన్నాడుతోంది. అదే అభిమానులను ఓట్లుగా మార్చుకోవడం. పవన్ పొలిటికల్ మీటింగ్ అంటే అదో ఉప్పెన. జన తరంగం పొంగినట్లుగా ఉంటుంది. పవన్ ఒక్క పిలుపే జన సునామీని తీసుకొస్తుంది. జన సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు ఉండవు. ప్రత్యేక బస్సులు వేయరు. లారీల్లో జనాలను తీసుకురారు. కానీ సభా ప్రాంగణం చూస్తే అదో వెల్లువ.

పవన్ మాట్లాడే ప్రతి ఒక్క మాటకు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు అభిమానులు. కానీ, ఎన్నికల దగ్గరికి వచ్చే సరికి ఆ అభిమానం ఓట్ల రూపంలో మారడం లేదు. నవంబర్ 30న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే తేలింది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. కానీ, చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పవన్ పార్టీ. అంటే, పవన్ సభలు సినిమా సక్సెస్ మీట్ గానే ముగుస్తున్నాయి తప్ప రాజకీయ సభగా ఓట్లు కురిపించుకోలేకపోతున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లోనే కాదు పవన్ రాజకీయ ప్రయాణం మొత్తం ఇదే విషయం అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల స్వయాన పవన్ ఓడిపోవడానికి కారణం కూడా అభిమానాన్ని ఓట్లుగా మార్చలేకపోవడమే. ఇక రెండోది ధనస్వామ్య రాజకీయం. ఎన్నికలు అంటేనే ధనస్వామ్యం. డబ్బు లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదనే విషయాన్ని ఎవరైనా గుర్తించాలి. పైసాయే పరమాత్మగా వర్థిల్లుతున్న ప్రస్తుత సమయంలో తన లక్ష్యం కోసమే పని చేస్తానంటే కుదరదు. ఓట్లు వస్తే రానీ లేదంటే లేదు అనే పద్ధతి ఎంతమాత్రమూ సరికాదు.

ఇలాంటి వ్యాఖ్యలతోనే పవన్ కల్యాణ్ తన పదేళ్ల ప్రయాణంలో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. సిద్ధాంతపరంగా పవన్ ను ఎవరూ తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ, సభలకు సమావేశాలకు వచ్చిన వారికి కనీసం భోజనం అయినా పెట్టాలి. పవన్ సభలకు ఇలాంటివేవీ ఆశించకుండానే అభిమానులు వస్తున్నారు. పవన్ వరకు అది చెల్లుతుందేమో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తామనుకునే అభ్యర్థులు వ్యక్తిగతంగా పవన్ అభిమానులతో కనెక్ట్ అవ్వాలంటే ఎంతో కొంత ఖర్చు చేయాలి.

ఇక మూడోది పోల్ మేనేజ్ మెంట్. ఎన్నికల్లో గెలవాలంటే పకడ్బందీ పోల్ మేనేజ్ మెంట్ ముఖ్యం. తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విషయంలోనే జనసేన వెనుకబడిందని చెబుతున్నారు పరిశీలకులు. ఇక, ఏపీలోనూ పోల్ మేనేజ్ మెంట్ ఎంత కచ్చితంగా చేయగలిగితే అంత మంచి ఫలితాలు సాధిస్తారు అనడంలో సందేహం లేదు. పోల్ మేనేజ్ మెంట్ లో ఇన్నాళ్లూ వెనుకబడిన జనసేన ఏపీ ఎన్నికలకైనా ఆ లక్షణాన్ని అలవర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఇక, తరువాతది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం. పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోవడం పవన్ కు పెద్ద సమస్యగా మారిందంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే ఏ పార్టీ అయినా సక్సెస్ సాధిస్తుంది. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న జనసేనాని ఇటీవల పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ గ్రామస్థాయి వరకు విస్తరించేలా ప్రణాళికలను రచిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కోవర్టులను బయటకు పంపించడానికి ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు పవన్ కల్యాణ్. కోవర్టు ఆపరేషన్ పై గట్టిగా వ్యవహరిస్తున్న పవన్.. టీడీపీతో పొత్తు విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Also Read : ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం

టీడీపీతో సమన్వయం.. పదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికే పరిమితమైన పవన్.. ఈసారి ఎలాగైనా అధికారపక్షంగా ఆవిర్భవించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అందుకోసం చాలాకాలం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెబుతూనే ఉన్నారు. ఇందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే, ఇలా మిత్రపక్షంతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ పార్టీ ఆ పార్టీలతో సమన్వయం చేసుకోవడంలో విఫలం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే గత ఐదేళ్లుగా బీజేపీతో ఏపీలో పొత్తులోనే ఉన్న జనసేన.. ఎప్పుడూ ఆ పార్టీతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేక పోయింది. ఈ విషయంలో ఏపీలో బీజేపీ నేతలు కలిసి రావడం లేదని భావించినా తెలంగాణ ఎన్నికల్లోనూ అదే బీజేపీ ఓట్లను పొందడంలో విఫలమైంది జనసేన.

ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీతో సరైన సమన్వయం సాధించడం అతి ముఖ్యం అంటున్నారు పరిశీలకులు. పంచతంత్రంగా పవన్ నిర్దేశించుకున్న ఈ ఐదు సూత్రాలను తూచ తప్పకుండా పాటిస్తే తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సక్సెస్ అవుతారని అంటున్నారు పరిశీలకులు. మరి మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో జనసేనాని పవన్ కు వచ్చే 60 రోజులు అత్యంత కీలకం అంటున్నారు పరిశీలకులు. ఇందుకోసం పవన్ ఎలా నడుచుకుంటారు? పార్టీని ఎలా నడిపిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.