×
Ad

Cyclone Montha : మొంథా తుపాన్ వచ్చేస్తోంది.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఇంటి నుంచి బయటకు రావొద్దు.. అందుబాటులోకి హెలికాప్టర్లు

Montha Cyclone మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

Cyclone Montha

Cyclone Montha : ఏపీ ప్రజలను మొంథా తుపాన్ భయపెడుతుంది. కోస్తా జిల్లాలపైకి తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాకాతంలో తీవ్ర వాయుగుండగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మంగళవారం దాదాపు 12గంటల పాటు ఈ తుపాను తీవ్రత కొనసాగి.. ఆ తరువాత బలహీనపడొచ్చుని అధికారులు పేర్కొన్నారు.

మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. తుపాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్, ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని.. మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్ట్స్ లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తుపాను కారణంగా సోమవారం ఏపీలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. మూడు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ అయింది. అదేవిధంగా మంగళవారం 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.

తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

తుపాను సన్నద్ధతపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ఆమె సూచించారు. గంటకు 100 కిలోమీటర్లుకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హెలిప్యాడ్లు సిద్ధం చేశామని, నౌకాదళ హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి అదనపు హెలికాప్టర్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హోమంత్రి అని తెలిపారు. తీర ప్రాంతాల్లో 14బోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు.

ఇవాళ (సోమవారం) కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో ఒకటి, రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.