తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో 15రోజుల పసికందు కిడ్నాప్, హత్య
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో 15రోజుల పసికందు కిడ్నాప్, హత్య కేసుని పోలీసులు చేధించారు. ఈ కేసులో అసలు నిజాలు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. అసలు పాప కిడ్నాపే అవ్వలేదు. పాపను హత్య చేసింది మరెవరో కాదు.. బిడ్డ అమ్మ, అమ్మమ్మ, ముత్తవ్వలే. ఆడపిల్ల కావడంతో పోషించడం భారం అవుతుందని ముగ్గురూ కలిసి చంపేశారు.. ఈ దారుణం పోలీసులనే కాదు స్థానికులనూ విస్మయానికి గురి చేసింది.
మూడు తరాలుగా ఆ వంశంలో ఆడపిల్లలే:
రెండు రోజుల క్రితం జరిగిన చిన్నారి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం(జూన్ 21,2020) అరెస్ట్ చేశారు. గంధం నూకరత్నం(70) (సృజన అమ్మమ్మ), మల్లిరెడ్డి మహాలక్ష్మి(సృజన అమ్మ), కాళ్ల సృజన(20) (బిడ్డ తల్లి)లను అరెస్ట్ చేసినట్టు డీఎస్‌పీ తెలిపారు. గంథం కనకరత్నానికి ఇద్దరు కూతుళ్లు. మహాలక్ష్మి, నాగమ్మ. మహాలక్ష్మికి ఇద్దరు కూతుళ్లు. సృజన, ప్రమీల. రెండో కూతురు నాగమ్మకు ఇద్దరు కూతుళ్లు. మూడు తరాలుగా తమ ఇంట ఆడపిల్లలే పుడుతుండడంతో వారు విసిగిపోయారు. ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకున్నారు. 15రోజుల నవజాత శిశువును అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ కడతేర్చారు.
ఆడపిల్ల భారం అని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చంపేశారు:
సృజనకు గతేడాది మేలో అదే గ్రామానికి చెందిన సతీష్‌తో వివాహమైంది. జూన్ 4న రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సృజన అమ్మకు, అమ్మమ్మకు ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేదు. జూన్ 6న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి చినకొండేపూడిలోని పుట్టింటికి సృజన బిడ్డను తీసుకువెళ్లింది. అప్పటినుంచి సృజన అమ్మ, అమ్మమ్మ ఆడబిడ్డ ఎందుకు ఖర్చు దండగ అని సూటిపోటి మాటలు ఆమెకు నూరిపోశారు. వారి మాటలతో సృజన కూడా ఏకీభవించింది. ఆ తర్వాత ముగ్గురూ కలిసి పసిబిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ ఇంట్లో పడుకుని ఉండగా సృజన, మహాలక్ష్మి, కనకరత్నం బిడ్డను తీసుకుని బయటకు వచ్చారు. పాపను ఇంటికి సమీపంలో ఉన్న బావిలో పడేసి చంపేశారు. తిరిగి ఏమీ తెలియనట్లు గదిలోకి వచ్చి పడుకున్నారు.
పాపను ఎవరో ఎత్తుకుపోయారని డ్రామా:
పథకం ప్రకారం సృజన అమ్మమ్మ కనకరత్నం రాత్రి 3 గంటల సమయంలో లేచి పాప కనపడడం లేదని కేకలు వేసింది. సృజన, మహాలక్ష్మి కూడా లేచి పాపను ఎవరో తీసుకువెళ్లిపోయినట్టు కట్టుకథ అల్లారు. పాప కోసం గాలించారు. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేసి కీలక సమాచారం సేకరించారు. అసలు నిజం బయటపెట్టారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ, ముత్తమ్మ హత్య చేసినట్టుగా గుర్తించారు. ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిసి హత్యకు పాల్పడ్డారని, ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని చెప్పారు.
సమాజంలో మార్పు రావాలి:
బోసినవ్వుల బుజ్జాయిలను చూస్తే ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా పిల్లలను చూస్తే క్షణాల్లో మాయమైపోతాయి. ఆడబిడ్డ లక్ష్మీదేవితో సమానమని నమ్ముతారు. ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. కానీ ఆ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు మాత్రం పసిపాపను భారమనుకున్నారు. నవమాసాలు మోసి కన్న నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా కర్కశంగా చంపేయడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటన సభ్య సమాజాన్ని సిగ్గు పడేలా చేసింది. ఆడపిల్ల అంటే భారం అనుకునే రోజులు పోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.