mp margani vs jakkampudi: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమంటున్నారు. కొంతకాలంగా ఎంపీ భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఆధిపత్య పోరు మొదలవ్వగా.. ఇప్పుడది రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పాకిందంటున్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉన్న రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజా ఆధిపత్యాన్ని ఎంపీ భరత్ జీర్ణించుకోలేకపోతున్నారట.
నువ్వా నేనా అని పోటీ:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటన, ఏపీ టూరిజం కంట్రోల్ రూం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల ఆధిపత్య పోరు బహిర్గతం అయిందని చెబుతున్నారు. బలమైన సామాజిక వర్గాలు, కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు నాయకులు ఫ్లెక్సీల్లో ఫొటోల నుంచి పార్టీలో చేరికల వరకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలనే తేడా లేకుండా నువ్వా నేనా అని అనుకోవడంతో పార్టీ కేడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు. మంత్రులు సర్ది చెప్పినా, పార్టీ పెద్దలు పంచాయితీ చేసినా, సీఎం లెక్చర్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని తాకిన ఆధిపత్య పోరు:
రాజా, భరత్ రామ్ మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని తాకిందని టాక్. సిటీతో జక్కంపూడి రాజా కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా ఇక్కడే ఉంటున్నారు. ఎంపీగా భరత్ కూడా అక్కడే ఉంటున్నారు. సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి శివరామసుబ్రహ్మణ్యం మాత్రం జక్కంపూడి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా రాజా వర్గంలో చేరిపోయారని చెబుతున్నారు. ఈ విషయంలో భరత్‌కు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కేడర్‌ను గ్రూపులుగా విడదీయడంపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు. అన్ని కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు.
రాజమహేంద్రవరంలోనూ గుడ్ మార్నింగ్ కార్యక్రమం:
జిల్లా మంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేపట్టిన గుడ్ మార్నింగ్ రామచంద్రాపురం కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో రాజమహేంద్రవరంలో కూడా అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం అనే కార్యక్రమానికి జక్కంపూడి రాజాతో పాటు నియోజవర్గ ఇన్‌చార్జి శివరామ సుబ్రహ్మణ్యం ఏర్పాట్లు చేశారు. అంతర్వేది పర్యటనకు వచ్చిన ధర్మాన కృష్ణదాస్, వేణుగోపాలకృష్ణను గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం కార్యక్రమానికి ఆహ్వానించారట. రాజా వర్గం చేపట్టిన కార్యక్రమానికి ఎంపీ భరత్‌కు ఆహ్వానం లేకపోవడంతో ఆయన వర్గం పోటీగా మరో కార్యక్రమానికి ఏర్పాట్లు చేసారని టాక్.
శుభోదయం-ప్రజల వద్దకు వైసీపీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, కృష్ణదాస్, వేణుగోపాలకృష్ణను ఆహ్వానించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే సమయంలో ఏర్పాటు చేయడం, రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారని తెలియడంతో మంత్రులు తెలివిగా తప్పించుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతర్వేది సాకుగా చూపి ఇన్‌చార్జి మంత్రి ధర్మాన, అనారోగ్యాన్ని సాకుగా చూపి వేణుగోపాలకృష్ణ గాయబ్ అయ్యారని టాక్. యాదృచ్ఛికమో లేక ఆధిపత్య పోరు సంకేతమో గానీ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన డివిజన్లు కూడా 13, 31 కావడంపై ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతోందట.
వైసీపీ కేడర్ ఇబ్బందులు:
టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీ కేడర్ ఇబ్బందులు పడుతోంది. వర్గాలుగా విడిపోతే విడిపోయారు కానీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో గ్రూపు రాజకీయాలేంటంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భరత్, రాజాల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగాలంటున్నారు.