వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధం అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలంటూ కాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ నేతలు కలవనున్నారు. రాఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. విజయసాయి రెడ్డి, సురేష్, శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్, మిథున్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఓంబిర్లాను కలవనున్నారు.
మరోవైపు రాఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్సన్ చర్యలను అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక అయ్యానని ఆ పిటిషన్‌లో వివరించారు.
ఈ సంధర్భంగా రఘురామకష్ణంరాజు 10Tvతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇన్నాళ్లు సీఎం జగన్‌కు తెలియకుండా నడుస్తోందని భావించానని, ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎంపీలు, న్యాయవాదులను వెళ్తున్నారంటే.. సీఎం కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే.. పార్లమెంట్‌లో ఎవరూ ఉండరని అన్నారు.
వైసీపీ ఎంపీలు విమానంలో ఢిల్లీ వెళ్లి ఓం బిర్లాను కలవాలనుకోవడంపై కూడా రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ఎంపీలు వెళ్లినంత మాత్రాన ఏమీ ఒరగబోదని అన్నారు. ఎవరో ఒక ఎంపీనీ ఉదాహరించి అనర్హత వేటు వెయ్యాలని భావిస్తున్నారని, తాను పార్టీకి కానీ, విధానాలకు కానీ, వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను పొగుడుతూనే వైసీపీ ఎంపీలను సుతిమెత్తని కామెంట్లు చేశారు.
ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదు. విమానంలో ఢిల్లీలో వెళ్లి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడమేంటి?. మెయిల్ ద్వారా పంపొచ్చు. ఏదో షో చేసుకుంటున్నారు అంతే. నేను మా ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాను. పార్టీని పల్లెత్తు మాట అనలేదు. పార్టీలోని కొందరి గురించి అభిప్రాయం మాత్రమే చెప్పానని అన్నారు.
Read:మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే : సజ్జల రామకృష్ణారెడ్డి