Muslim devotee donates Rs 1 cr
Muslim devotee donates Rs 1 cr: తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై ఓ ముస్లిం భక్తిప్రపత్తులు కనబర్చారు. స్వామి వారి సేవలో పాల్గొని రూ.కోటి విరాళం అందించారు. చెన్నైకి చెందిన అబ్దుల్ ఘనీ అనే వ్యక్తి వేంకటేశ్వరుడి భక్తుడు. ఆయన గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి వాహనాలు, ఫర్నిచర్, నగదును విరాళంగా అందిస్తున్నారు. నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రూ.1.02 కోట్ల చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందించారు. అందులో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు రూ.15 లక్షలు, శ్రీపద్మావతి విశ్రాంతి భవనానికి ఫర్నిచర్, వంట శాలలో పాత్రలకు రూ.87 లక్షలను వినియోగించనున్నారు.
ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ఇవాళ మీడియాకు వివరించి చెప్పారు. కాగా, 1984లో హైదరాబాద్ కు చెందిన ఓ ముస్లిం భక్తుడు 108 చిన్నపాటి బంగారు కమలాలను అందించారు. వాటితో శ్రీవారికి అలంకరించాలని కోరారు. దీంతో ‘అష్టదళ పాద పద్మరథన’ పేరుతో ప్రత్యేకంగా టీటీడీ ప్రత్యేక చెల్లింపుల సంప్రదాయాన్ని ప్రారంభించింది.