mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మరణమేనంటూ మృతుడి భార్య ఆవేదన… దాంతో అనుమానాస్పద మృతి కాస్తా మిస్టరీ మరణంగా మారింది. ఖననం చేసిన డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టం చేయడం సంచలనంగా మారింది.
ఒక్క మరణం.. ఎన్నో అనుమానాలు.. ఆ ఎన్నారైది సహజ మరణమా..? పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారా..? భార్యే..మొగుడి ప్రాణాలు తీసిందా..? మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణల్లో నిజమెంత..? ఎన్నారై సురేశ్ మరణం వెనుక అసలేం జరిగింది..?
హత్య అంటున్న కుటుంబసభ్యులు, సహజ మరణమే అంటున్న భార్య:
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎన్నారై సురేశ్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి మరి… పోస్టుమార్టం నిర్వహించడం సంచలనంగా మారింది. సురేశ్‌ది ముమ్మాటికీ హత్యేనని.. భార్యే చంపేసిందని…మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తుంటే….తన భర్తది సహజ మరణమేనని చెబుతోంది సురేశ్ భార్య ప్రమీల. దీంతో అనుమానాస్పద మృతి కాస్తా…మిస్టరీ మరణంగా
మారింది.
ఆరోగ్యం బాగోలేదని ఫోన్, అంతలోనే గుండెపోటుతో మరణం, హడావుడిగా అంత్యక్రియలు:
ఒడిశా రాష్ట్రం పెంటకోట గ్రామానికి చెందిన వంకా సురేశ్.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ప్రమీలను 13ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సురేశ్ జపాన్‌లో ఉద్యోగం చేస్తుండగా…కరోనా కారణంగా ఇండియాకు తిరిగొచ్చి.. నాటి నుంచి భార్యాపిల్లలతో కలిసి తునిలో ఉంటున్నాడు. సీన్ కట్ చేస్తే… మీ అన్నయ్యకు ఆరోగ్యం బాగోలేదంటూ….ఒడిశాలో ఉండే సురేశ్ సోదరులకు తునిలో ఉండే బంధువులు ఫోన్ చేశారు. వెంటనే అక్కడి నుంచి సోదరులిద్దరూ బయలుదేరారు. ఆ కాసేపటికే మళ్లీ ఫోన్ చేసిన బంధువులు.. గుండెపోటుతో మృతి చెందాడని చెప్పారు. వెంటనే బయల్దేరి వచ్చిన ఆ ఇద్దరూ…శవ పేటికలో ఉన్న సురేశ్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం సురేశ్ భార్య తరపు బంధువులు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు.
సురేష్ ముఖంపై గోర్లతో గిల్లిన గాయాలు, చెవి పక్కన నల్లగా కమిలిపోయిన గాయాలు:
మరుసటి రోజు…సురేశ్ డెడ్‌బాడీ ఫొటోలను చూస్తుండగా…ముఖంపై గోర్లతో గిల్లిన గాయాలు, చెవి పక్కన నల్లగా కమిలిపోయిన గాయాలు…సోదరులిద్దరికి కన్పించాయి. దాంతో ఆ గాయాల గురించి సురేశ్ భార్యని అడిగారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకుండా తమను దూషించిందని మృతుడి సోదరులు చెబుతున్న మాట. దీంతో సురేశ్‌ది సహజమరణం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే తుని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బయటకు తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే తుని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై తమకు నమ్మకం లేదని..పోస్టుమార్టం చేసేందుకు కాకినాడ నుండి వైద్యులను తీసుకుని రావాలని కోరారు మృతుడి సోదరులు. దీంతో కాకినాడ నుంచి వైద్యులను రప్పించిన పోలీసులు…పోస్టుమార్టం నిర్వహించారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే చంపేసిందా?
అయితే…వివాహేతర సంబంధం నేపథ్యంలోనే సురేశ్ భార్యే…తమ కుమారుడని హత్య చేసిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సురేశ్ భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులపైనా అనుమానం ఉందని..వారందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు. సురేశ్‌ది ఒకవేళ హత్యే అయితే… వివాహేతర సంబంధమే కారణమా..? లేదంటే కుటుంబ కలహాలు, ఆస్తి వ్యవహారలేమైనా కారణమా.. అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారణం ఏదైనా… ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.