‘ఇదేం రూల్..!?’.. పెట్రోల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ కొనాలా?

Nandyal district : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో పెట్రోల్ బంక్ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. డీజిల్ కావాలంటే ఇంజన్ ఆయిల్ కొనాల్సిందేనంటూ యాజమాన్యం మెలిక పెట్టింది.

Nandyala : ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తుండగా.. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు మూత పడుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10శాతం పెట్రోల్ బంకులు మూత పడినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. విజయవాడ పరిధిలోని పలు బంక్ లలో ఇంధన కొరత నేపథ్యంలో మోటార్ సైకిళ్లకు రూ.300 చొప్పున, ఫోర్ వీలర్లకు రూ.1500 చొప్పున మాత్రమే పెట్రోల్, డీజిల్ కొడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతను ఆసరాగా చేసుకున్న కొందరు పెట్రోల్ బంకుల యాజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

Also Read : AP Govt : ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. డీజిల్ కావాలంటే ఇంజన్ ఆయిల్ కొనాల్సిందేనంటూ మెలిక పెట్టింది. ప్రతి 30లీటర్ల డీజిల్‌కు ఒక లీటర్ ఇంజన్ ఆయిల్ తప్పనిసరి చేసింది. దీంతో బంక్ యాజమాన్యం తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఇబ్బందులు పడుతుంటే.. కొత్తగా డీజిల్ కావాలంటే ఇంజన్ ఆయిల్ తీసుకోవాలంటూ పెట్రోల్ బంక్ యాజమాన్యం చెబుతుండటంపై వాహనదారులు మండిపడుతున్నారు.

డీజిల్ దొరక్క ఆత్మకూరు ప్రాంతంలో రవాణా, వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ.. కండీషన్లు పెట్టి అమ్ముతున్నారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపిన బంకులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.