Suneetha Narreddy Posters
Suneetha Posters: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత (Suneetha Narreddy)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన పోస్టర్లపై మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి (Nandyala Varada Rajulu Reddy) మండిపడ్డారు. సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలియడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఫొటోలు కూడా ఉన్నాయి.
దీనిపై ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సునీతమ్మ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మానవత్వం లేకుండా పోస్టర్లు వేయించడం దారుణమని చెప్పారు. రాజకీయాలు నీచమైపోయాయని తాము ఎప్పుడో సునీతమ్మకు చెప్పామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నాయకుల ఫొటోలు వేసి మరీ పోస్టల్ అతికించడం అనేది సిగ్గు, మానవత్వం లేని వారు చేసే పని అని చెప్పారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి శిక్ష పడాలని సునీత పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఇటువంటి సమయంలో వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారని పోస్టర్లు వేయడం సిగ్గు లేని చర్య అని చెప్పారు.
వివేకాకు రెండవ భార్య ఉందని.. కుమార్తె, అల్లుడే వివేకాను చంపి ఉంటారని కొందరు మాట్లాడటం దారుణమని అన్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి టీడీపీ నేతల ఫొటోలతో పోస్టర్లను వేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో నీచాతి నీచంగా పోస్టర్లు వేశారని చెప్పారు. ఇటువంటి రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అన్నారు.
సునీత గురించి వెలసిన పోస్టర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి (Praveen Kumar Reddy) స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారని అన్నారు. వివేక హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారని చెప్పారు.
వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు. సునీతతో పాటు పోస్టర్లో టీడీపీ నేతల ఫొటోలు వేశారని గుర్తు చేశారు. ఆ పోస్టర్లతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
YS Sunitha Reddy : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు .. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్