Perni Nani
Perni Nani – YSRCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వ్యవహారం తారస్థాయికి చేరింది. ఇవాళ సెక్రెటరియేట్లో సీఎస్ జవహర్ రెడ్డి(Jawahar Reddy)ని పేర్ని నాని కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ప్రసన్న వెంకటేశ్ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు.
జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదని పేర్ని నాని చెప్పారు. ప్రసన్న వెంకటేశ్ తీరుకి వ్యతిరేకంగా సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తానని మరోసారి అన్నారు.
సీఎంతో చర్చించిన నాని..
అనంతరం పేర్ని నాని జగన్ ను కలిశారు. సీఎంతో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించానని కొందరు అంటున్నారని చెప్పారు. అధికార పార్టీలో ఉన్నా వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పా అని నిలదీశారు. తాను ప్రసన్న వెంకటేశ్ తో నిన్న మాట్లాడానని తెలిపారు.
వ్యవస్థలకు నష్టం జరగకూడదనే తాను అలా మాట్లాడానని ప్రసన్న వెంకటేశ్ కు చెప్పానని పేర్ని నాని వివరించారు. జెడ్పీ సమావేశాలకు హాజరు కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ చెప్పారని అన్నారు. ప్రతిపక్షం నిద్రపోతే తాను ఏం చేయాలని నిలదీశారు. సీఎం జగన్ దగ్గరకు కాకుండా, మరి ఇంకెవరి వద్దకెళ్లాలని అన్నారు. చంద్రబాబు దగ్గరకో లేదంటే హు.. హ అనే వ్యక్తి (పవన్ కల్యాణ్) దగ్గరకో వెళ్లాలా అని ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, చెప్పినట్లే విభజన చేశారని తెలిపారు. అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయని, ఇప్పుడు జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లకి సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయని చెప్పారు. ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప హోదా ఉన్న అధికారులెవ్వరూ సమావేశానికి రాలేదని తెలిపారు. అంతేగాక, ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులనో, గుమాస్తాలనో సమావేశానికి పంపారని విమర్శించారు.
ఇలా పరిస్థితులు ఉంటే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా అని నిలదీశారు. వచ్చే సమావేశాల్లో ఏలూరు కలెక్టర్ పాల్గొనకపోతే సీఎం జగన్ నివాసం వద్ద ధర్నాకు దిగుతానని చెప్పిన మాటపై వెనక్కు తగ్గడం లేదని చెప్పారు.
నిన్న కూడా ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సీఎస్ కు ఫిర్యాదు చేస్తుండడంతో పేర్ని నాని వర్సెస్ ప్రసన్న వెంకటేశ్ వ్యవహారం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే సీఎంఓకు వచ్చి మాట్లాడారు ప్రసన్న వెంకటేశ్.
నిన్న పేర్ని నాని ఏమన్నారు?
నిన్న కృష్ణా జడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించని వారిని ఉపేక్షించకూడదని చెప్పారు. ఉమ్మడి కృష్ణాలో సమావేశాలకు రాకుండా ప్రసన్న వెంకటేశ్ నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. వారి తీరుపై తాను జెడ్పీటీసీ సభ్యులతో వెళ్లి సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతానని హెచ్చరించారు.