Nara Lokesh
Nara Lokesh : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ఆయన అన్నారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే పరీక్షలు రద్దు చేయాలని పోరాడుతున్నామని తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మందికి ముప్పు పొంచి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ తీరుపై లోకేశ్ స్పందించారు. నీళ్లు పారే రాయలసీమలో మళ్లీ రక్తం పారటానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తపాతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలండెర్ అని రుజువైందని అన్నారు.
అప్పట్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది జగన్ కాదా? అని నిలదీశారు. తాను సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. గతంలో సీఎం చంద్రబాబును కాల్చమని, ఆయన చొక్కా పట్టుకోవాలని, చెప్పుతో కొట్టాలని జగన్ అన్నారని, తాను మాత్రం ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.