Nara Lokesh
Nara Lokesh – TDP: వైసీపీ (YCP) నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తన కుమారుడు దేవాన్ష్‌తో సహా తన కుటుంబ సభ్యులందరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఎవ్వరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
తమపై వస్తున్న అసత్య ఆరోపణలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పరువునష్టం దావాలు వేస్తున్నానని నారా లోకేశ్ అన్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి అవినీతి జరగకపోయినా తనపై అసత్య ఆరోపణలు చేశారని, అసలు ఆ విషయం తన మంత్రిత్వ శాఖ పరిధిలోది కాదని చెప్పారు.
యువగళం పాదయాత్రలో దళితులను అవమానించానని దుష్ప్రచారం చేశారని, దానిపై కూడా త్వరలో క్రిమినల్ కేసులు దాఖలు చేస్తానని నారా లోకేశ్ తెలిపారు. పేదలపై ప్రేమ ఉంటే ఆర్3 జోన్ లోని భూములు వారికి ఇవ్వవచ్చు కదా? అని అన్నారు. కొత్తగా ఆర్5 జోన్ పేరిట వైసీసీ పేదలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
వైసీపీ రాష్ట్రంలో మొత్తం కేవలం 9,000 ఇళ్లు మాత్రమే కట్టిందని లోకేశ్ చెప్పారు. తాము ఎన్నడూ తప్పు చేయలేదని, తమపై చేసిన ఆరోపణలలో ఒక్కటీ నిరూపించలేకపోయారని అన్నారు. జగన్ మాత్రం జైలుకెళ్లటంతో పాటు అక్రమ ఆస్తుల జప్తు జరిగిందని వివరించారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా కథల గురించి చర్చించడానికి ముఖ్యమంత్రి జగన్ కి టైమ్ దొరుకుతుంది కానీ వరదలపై సమీక్ష చేయరా? అని లోకేశ్ అన్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న సజ్జలకు వరదలపై సమీక్ష చేసే తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు.