వైసీపీ – టీడీపీ డిష్యూం..డిష్యూం : తమ జోలికి వస్తే..తన్ని తరిమి కొడుతాం – లోకేష్

  • Publish Date - March 4, 2020 / 01:13 AM IST

సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్‌ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు.  మునికూడలి గ్రామం దగ్గర వందమంది వైసీపీ కార్యకర్తలు టెంట్‌వేసి రోడ్డుగా అడ్డంగా బైఠాయించారు.  లోకేష్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

లోకేష్‌ వాహనం వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులు వారిని వెనక్కి నట్టే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.  మహిళా పోలీసులను కూడా తోసేసి కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చే ప్రయత్నం చేశారు. ఈ దశలో టీడీపీ కార్యకర్తల్లో కొందరు వైసీపీ నేతలతో వాదనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులకూ గాయాలు అయ్యాయి.  చివరకు పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. వైసీపీ కార్యకర్తల దాడిపై నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ అనంతరం తాము ప్రశాంతంగా వస్తోంటే.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు.

రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడం రాజ్యాంగపరంగా లభించిన హక్కని… అధికారం ఉందని అడ్డుకుంటే ఊరుకోబోమన్నారు. తమ జోలికి వస్తే తన్ని తరిమి కొడతామని హెచ్చరించారు. ఇది పులివెందుల, ఇడుపులపాయకాదన్నారు. అనంతరం లోకేష్‌ తిరుగు పయనంకాగా.. ఆయనను మరోసారి అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే పోలీసులు హైడ్రామా మధ్య లోకేష్‌ను కారులోనే విజయవాడకు పంపించారు. 

ఇటీవలే విశాఖపట్టణం పర్యటనకు వెళ్లాలని అనుకున్న బాబు పర్యటనను కూడా వైసీపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానీయ్యకుండా ఆందోళనలు చేపట్టారు. చివరకు ఆయన విశాఖలో పర్యటించకుండానే..వెనుదిరిగాల్సి వచ్చింది. 
Read More : ఏపీ కేబినెట్ భేటీ…అజెండా ఇదే