నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?

Narsapuram: ఆ ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశ వదులుకోకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం..

Narsapuram

సీఎం జగన్‌ నిర్ణయమే వైసీపీలో ఫైనల్‌.. ఆయన ఏదైనా డిసైడ్‌ అయితే ఇక వెనక్కి తగ్గనే తగ్గరు. పార్టీలో అయినా.. ప్రభుత్వంలో అయినా జగన్‌ డెసిషన్‌ తీసుకున్నారంటే అమలు కావాల్సిందే… అయితే, ఇదంతా గతం అంటున్నారు కొందరు వైసీపీ నాయకులు.. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని కోరుతున్నారు.

ప్రస్టేజియస్‌ నియోజకవర్గం గెలవాలంటే అభ్యర్థిని మళ్లీ మార్చాలంటున్నారు. ఇంతకీ ఆ ప్రస్టేజియస్‌ నియోజకవర్గమేదీ? సీఎం నిర్ణయం ఎందుకు మార్చుకోవాలని అక్కడి క్యాడర్‌ కోరుతున్నారో ఇప్పుడు చూద్దాం…

రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే… 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే… ఒక్క నరసాపురం పార్లమెంట్‌ సీటు ఒక ఎత్తు. సిట్టింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంత క్రేజ్‌ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం జగన్‌పైనా.. వైసీపీపైనా ఎర్రజెండా ఎగరేసిన రఘురామ… వైసీపీకి కంట్లో నలుసులా మారారు.

వైసీపీ వర్సెస్‌ ట్రిపుల్‌ ఆర్‌గా చెప్పే రఘురామకృష్ణంరాజు మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్లిందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున రఘురామకృష్ణంరాజు మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమే.. రఘురామకృష్ణంరాజును ఎలాగైనా ఓడించాలనేది వైసీపీ ప్రధాన టార్గెట్‌.

సామాజిక, ఆర్థిక కోణాలన్నీ సమీక్షించి..
రఘురామకృష్ణంరాజు ఓటమే ధ్యేయంగా వైసీపీ ఓ కొత్త అభ్యర్థిని నరసాపురం ఇన్‌చార్జిగా ప్రకటించింది. సామాజిక, ఆర్థిక కోణాలన్నీ సమీక్షించి న్యాయవాది గూడూరి ఉమాబాలను సమన్వయకర్తగా నియమించింది వైసీపీ… నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాపులు, క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువ.

గత నాలుగు దశాబ్దాల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలిచిన వారంతా క్షత్రియు, కాపు సామాజిక వర్గం నేతలే.. దీంతో ఈ సారి వైసీపీ ప్లాన్‌ మార్చింది. బీసీ కార్డు ప్రయోగించి పార్లమెంట్‌ బరిలో మహిళా అభ్యర్థిని దింపాలని ఫిక్స్‌ అయింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని స్థానికంగా ఉన్న బీసీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఏ ఈక్వేషన్‌ చూసి నిర్ణయం తీసుకుందోగాని.. మరోసారి నరసాపురంపై సమీక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు లోకల్‌ లీడర్లు.

నరసాపురం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. దీంతో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను ఎంపిక చేసింది వైసీపీ. అయితే ఈ నిర్ణయాన్ని మెజార్టీ బీసీ నేతలు పునః సమీక్షించమని కోరడం వెనుక బలమైన కారణం చూపుతున్నారు.

రఘురామను ఢీకొట్టాలంటే సమర్థులైన బీసీ నాయకులకు అవకాశం ఇవ్వాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామన నాగేశ్వరరావుతోపాటు బలమైన బీసీ నేపథ్యమున్న వాసర్ల ముత్యాలరావు కోరుతున్నారు. తనను ఆశ్వీర్వదించాలని ఉమాబాల వైసీపీలో ప్రముఖ నాయకులును కలుస్తుంటే.. మరోపక్క తమ ముగ్గురిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని బీసీ నేతలు కోరుతుండటం చర్చకు తావిస్తోంది.

వైసీపీ బీసీ నినాదంలో భాగంగా ఇప్పటివరకు శెట్టి బలిజ సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగిందని, బీసీల్లో ఇతర కులాలకు అవకాశాలు ఇవ్వాలంటే ఉమాబాలను మార్చాలని కోరుతున్నారు ఆ ముగ్గురు నేతలు. రఘురామను ఓడించడమే టార్గెట్‌ అయితే హైకమాండ్‌ మళ్లీ మార్పు చేయాలంటున్నారు.

సీఎం నిర్ణయం తీసుకున్నా.. ఆ ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశ వదులుకోకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం.. మరోవైపు ఉమాబాల ఎన్నికలకు సిద్ధమన్నట్లు క్యాడర్‌ను కలుస్తూ బిజీబిజీగా ఉంటుండటం వైసీపీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. రఘురామ టార్గెట్‌గా వైసీపీ ప్రయోగించిన బీసీ కార్డు ఎంతవరకు సఫలమవుతుందోకాని.. బీసీ నేతలను ఒక్కతాటిపైకి తేవడమే ప్రధాన సమస్యగా మారినట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

AP Politics: ఏపీలో రెబల్‌ ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్‌కు..

ట్రెండింగ్ వార్తలు