Neeraja Reddy
Neeraja Reddy: కర్నూలు జిల్లా ఆలూరు(Alur) మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్‌ఛార్జి నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హైదరాబాద్ హైవే ఇట్యాల, బీచుపల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తోన్న కారు టైర్ పేలింది. దీంతో ఆ కారు బోల్తా కొట్టింది. దీంతో నీరజారెడ్డి కారు నుజ్జునుజ్జు అయింది. నీరజా రెడ్డి హైదరాబాద్(Hyderabad) నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను పోలీసులు కర్నూలు(Kurnool)లోని శ్రీ చక్ర ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. కారు డ్రైవర్ బాబ్జికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కాగా, నీరజా రెడ్డి 2009 ఎన్నికల్లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనంతరం కొన్నేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె… 2019లో వైసీపీ(YCP)లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆలూరు(Alur) బీజేపీ ఇన్‌చార్జిగా ఆమె ఉన్నారు. నీరజా రెడ్డి మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.