Andhra Pradesh : శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. ఈనెల 20న వాళ్లందరి బ్యాంక్ ఖాతాల్లోకి రూ.25వేలు జమ..

Nethanna Sevalo Scheme : ఏపీలో నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హత ఉన్నప్పటికీ కొందరి ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. దీంతో వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Nethanna Sevalo Scheme

Nethanna Sevalo Scheme : ఏపీలోని చేనేతలకు కూటమి సర్కార్ ‘నేతన్న సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అర్హులైన చేనేత కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. రాష్ట్రంలో మొత్తం 71,536 మంది నేతన్నలకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అయితే, అర్హత ఉన్నప్పటికీ కొందరి ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. దీంతో వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Also Read : Cow Urine Procurement: గవర్నమెంట్ ‘గోమూత్రం ప్రాజెక్టు’.. లీటర్ రూ.10 చొప్పున కొని.. నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నారు

చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీలోగా నేతన్న సేవలో పథకం కింద అర్హులందరి ఖాతాల్లో రూ.25వేల చొప్పున జమ చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్నప్పటికీ.. కొంతమంది చేనేతల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమకాలేదని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో పథకం నిధులను జమ అయ్యే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలుసైతం జారీ చేయడం జరిగిందని చెప్పారు.

నేతన్న సేవలో పథకం కింద అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే ఆందోళన చెందాల్సిన పనిలేదని, తప్పకుండా వారి ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. మరో 13,678 మంది నేతన్న సేవలో పథకానికి దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో అర్హులను గుర్తించి త్వరలోనే ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.

నేతన్న సేవలో పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. సొంతంగా చేనేత మగ్గం ఉండి, చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తూ ఉండాలి. చేనేత సంఘాలలో, సొసైటీలలో సభ్యుడై ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందిస్తారు. ఆధార్ కార్డ్, చేనేత మగ్గం గుర్తింపు కార్డు లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, ఆదాయ పరిమితి ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ ఉండాలి. అనంతరం దరఖాస్తుల్ని పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చి ఆర్థిక సాయం అందిస్తారు.