చిగురిస్తున్న రైల్వేజోన్‌ ఆశలు.. విశాఖ రైల్వేజోన్‌పై కదలిక?

Vizag railway zone: జోన్‌ ఏర్పాటులో భూ కేటాయింపులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. గత ప్రభుత్వం..

విశాఖ రైల్వే జోన్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్రంలో ఏపీ ఎంపీలకు ప్రాధాన్యం పెరగడంతో రైల్వే జోన్‌ ఫైల్‌ బూజు దులిపే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన రైల్వేజోన్‌ పదేళ్లుగా కలగానే మిగిలింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడం కొత్త ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. 2019, ఫిబ్రవరి 27న కేంద్ర సర్కారు విశాఖ కేంద్రంగా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై ప్రకటన చేసింది. ఆ తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్డీ నియామకం జరిగింది. ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్‌ డీపీఆర్‌ అందింది. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో విశాఖ డివిజన్‌ తూర్పుకోస్తా రైల్వేగానే ఉంది.

విభజన హామీల్లో ఒకటి
విశాఖ జోన్‌ రాష్ట్ర విభజన హామీల్లో ఒకటి… 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి నేతలు ఇదే అంశాన్ని హామీగా ఇచ్చారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా రైల్వేజోన్‌ ప్రతిపాదన మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో 2018లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంది టీడీపీ.

ఆ తర్వాత ఎన్నికలకు ముందు 2019లో విశాఖ జోన్‌ ప్రకటనచేసి తన హామీని నెరవేర్చుకున్నట్లు చెప్పుకుంది బీజేపీ.. ప్రకటన విడుదలై ఐదున్నరేళ్లు ఐనా, జోన్‌ కోసం ఒక్క ఇటుక పడలేదు. పైగా గత ఎన్నికల ముందు రైల్వేజోన్‌ కోసం వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని బాంబ్‌ పేల్చారు అప్పటి రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌. ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా మారడం, వైసీపీ నష్టపోవడం జరిగింది.

కొత్త ప్రభుత్వంలో..
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుండటం, ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో విశాఖ రైల్వేజోన్‌కు కదలిక వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామ్మోహన్‌నాయుడు కూడా పలుమార్లు విశాఖ జోన్‌ కోసం పార్లమెంట్‌లో తన గళం వినిపించారు. ఇప్పుడు రామ్మోహన్‌ మంత్రిగా ఉండటంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వేజోన్‌కు ప్రాణం పోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జోన్‌ ఏర్పాటులో భూ కేటాయింపులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. గత ప్రభుత్వం ముడసర్లోవ రిజర్వాయర్‌ సమీపంలోని కృష్ణాపురంలో 55 ఎకరాల భూమి కేటాయించినట్లు చెబుతున్నారు. ఐతే ఆ భూమి వాటర్‌ ప్రాజెక్టుకు సమీపంలో ఉండటం వల్ల భవన నిర్మాణాలకు అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని… వాటిని తిరస్కరిస్తోంది రైల్వేశాఖ. వైసీపీ ప్రభుత్వం మాత్రం మొండిగా అవేభూములు తీసుకోవాలన్నట్లు పట్టుదల ప్రదర్శించింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం భూ సమస్యను పరిష్కరిస్తే… రైల్వేజోన్‌కు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయే అవకాశం ఉంది.

విశాఖ రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల. జోన్‌తోపాటు కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇక్కడివారు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రాంత ప్రతినిధి క్యాబినెట్‌లో ఉండటం… టీడీపీ కూడా జోన్‌కు అనుకూలంగా ఉండటంతో వీలైనంత త్వరగా దక్షిణ కోస్తా జోన్‌ ప్రారంభమవ్వాలని ఆశిస్తున్నారు.

Also Read: గాంధీ భవన్ వద్ద వీళ్లు మోకాళ్లపై కూర్చున్నారు: వీడియో పోస్ట్ చేసిన హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు