నిమ్మగడ్డ స్థానంలో ఏపీకి కొత్త ఎస్ఈసీ, రేసులో ఆ ముగ్గురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ కొత్త ఎస్ఈసీ నియామకంపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది.

new-sec-for-andhra-pradesh

new sec for andhra pradesh : నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ కొత్త ఎస్ఈసీ నియామకంపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ప్రేమచంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కి సిఫార్సు చేసింది జగన్ సర్కార్. మార్చి 31తో నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త ఎస్ఈసీని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

65లోపు వయసు ఉన్నవాళ్లు ప్రభుత్వ చీఫ్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పదవీ విరమణ చేసినవారి పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ మూడు పేర్లను గవర్నర్‌కు పంపిన తర్వాత ఒకరిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది. ఆ పేరుకే గవర్నర్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కూడా సాహ్నీకి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది.

నీలం సాహ్ని.. సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమెకు జీత భత్యాలతో పాటు అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయిచింది. సీనియార్టీతో ఆధారంగా గవర్నర్ ఎస్ఈసీని నియమిస్తారు. ఇందులో ప్రభుత్వ ఆసక్తిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోగా కొత్త ఎస్ఈసీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి అటు ఎస్ఈసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వైరం నెలకొంది. మధ్యలో ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి తిరిగి పదవిని చేపట్టారు.

అనంతరం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వం వ్యతిరేకించడం.. దీనిపైనా హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదనలు జరగ్గా.. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఇంకా నిర్వహించ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిమ్మగడ్డ హయాంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. తర్వాతి పరిణామాలతో నిమ్మగడ్డ తిరిగి పదవి చేపట్టారు. అయితే జస్టిన్ కనగరాజ్ ను పరిగణలోకి తీసుకోకుండా కొత్త జాబితాను గవర్నర్ కు పంపడం గమనార్హం. మరి ప్రభుత్వం పంపిన జాబితా నుంచి గవర్నర్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.