MANSAS TRUST: మాన్సస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్.. కోర్టుకెక్కిన ఊర్మిళ

విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. వివాదం ముదురుతున్నట్లే కనిపిస్తోంది.

Urmila

MANSAS TRUST: విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. వివాదం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవల హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ స్థానం నుంచి తొలగించగా.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు లాయర్. అశోక్ గజపతి రాజును‌ చైర్మన్‌గా తొలగించి ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని లాయర్ కోరగా.. విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్డుకు, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించడం వివాదాస్పదం అయ్యాక.. చివరకు కోర్టు ద్వారా అశోక్ గజపతి రాజు ఛైర్మన్ అయ్యారు. సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించడం చట్ట వ్యతిరేకం అని హైకోర్టు అభిప్రాయపడింది. అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు ఛైర్మన్ అయ్యారు. అయితే, 2016లో ఆనంద గజపతి చనిపోయాక అశోక్ గజపతిరాజు సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అయ్యారు.

అయితే, అకస్మాత్తుగా ప్రభుత్వం 2020 మార్చి 4న ఆనందగజపతి రాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును తెరపైకి తీసుకుని వచ్చింది. సంచయితతో పాటుగా పూసపాటి వంశానికే చెందిన అశోక్ గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతి రాజు, ఆనంద గజపతి మరో కుమార్తె ఊర్మిళా గజపతి రాజు, పి.వి.జి. రాజు కుమార్తె ఆర్.వి. సునీతా ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కే. సోంధీ, విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను ప్రభుత్వం ట్రస్ట్ బోర్టు సభ్యులుగా నియమించింది. ఈ మేరకు జీవో నంబరు 75ను విడుదల చేయగా.. ఆ జీవోను కొట్టేసింది కోర్టు.

మాన్సాస్ ట్రస్ట్ ఏం చేస్తుంది?
విజయనగరం జిల్లాలో పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్టచివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరాం గజపతి రాజు (పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్‌(మాన్సాస్)ను 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతాలకు పెద్దపీట వేస్తూ ఈ మాన్సాస్ ట్రస్టు‌ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మాన్సాస్ నిర్వహణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి మొత్తం 50 వేల కోట్ల రూపాయల విలువైన 14,800 ఎకరాల భూమి సాంకేతికంగా ఈ ట్రస్టు నియంత్రణలో ఉంది. అంతేకాదు.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే ఉన్నాయి.

ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ 12 విద్యా సంస్థలు నడుస్తుండగా.. 1,800 మంది ఉద్యోగులు ఉన్నారు. 15వేల మంది విద్యార్ధులు చదువుకుంటూ ఉన్నారు. ఈ విద్యా సంస్థలలోనే మాజీ రాష్ట్రపతి వీవీ గిరి వంటి వారు చదువుకున్నారు. ఇప్పుడు ఈ ట్రస్టే వివాదాలకు కారణం అవుతోంది.