Andhra Pradesh : ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
Andhra Pradesh : ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. మూలధన వ్యయం కోసం వడ్డీలేని రుణాల రూపంలో అందిస్తున్న సాస్కీ నిధులను అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కూడా వినియోగించుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Published on- August 4, 2026 / 08:34 AM IST
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలుగా సహాయక సహకారాలు అందిస్తూ భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఇదేక్రమంలో తాజాగా.. ఏపీకి కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. మూలధన వ్యయం కోసం వడ్డీలేని రుణాల రూపంలో అందిస్తున్న సాస్కీ (Special Assistance for Capital Investment – SASCI) నిధులను అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కూడా వినియోగించుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సాస్కీ నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ స్పందించారు. 2020-21 నుంచి 2026-27 ఆగస్టు 1 వరకు ఆంధ్రప్రదేశ్‌కు సాస్కీ పథకం కింద మొత్తం రూ.31,005.47 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2020-21 నుంచి 2023-24 వరకు రూ.11,386.16 కోట్లు, 2024-25 నుంచి 2026-27 ఆగస్టు 1 వరకు రూ.19,619.31 కోట్లు అందించినట్లు తెలిపారు.
అమరావతి నిర్మాణంకోసం సాస్కీ కింద ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించలేదని, అయితే, కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సాస్కీ నిధులను రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏ మూలధన ప్రాజెక్టుకైనా వినియోగించుకునే స్వేచ్ఛ ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు.. మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 2024-25లో 35.50 శాతం ఉండగా, 2025-26లో 35.40 శాతానికి తగ్గినట్లు తెలిపారు. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం రూ.82,855.51 కోట్లు, 2025-26లో రూ.86,486.29 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌యేతర రుణాలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఏపీలో మూడేళ్లలో విద్యాలక్ష్మి స్కీం ద్వారా రూ.280.67 కోట్ల విద్యారుణాలను అందించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాగే ఏపీలో మూడేళ్లలో 15 టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ మూతపడినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మూడేళ్లలో 342 కాలేజీలు మూతపడ్డాయన్నారు.
