×
Ad

TTD సంచలన నిర్ణయం.. తిరుమల కొండపైకి నో ఎంట్రీ!

  • Publish Date - March 19, 2020 / 10:37 AM IST

కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కిందకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తులు కిందికి వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్ తెరిచి ఉంచింది. ఎక్కడిక్కడ వాహనాలను నిలిపివేశారు. మెట్ల మార్గం కూడా అధికారులు మూసివేశారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఒక బృందంతో కలిసి కొండపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అతన్ని గుర్తించిన అధికారులు టీటీడీకి చెందిన ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిమ్స్‌కు తరలించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించిన అనంతరం టీటీడీ వెంటనే ఆకస్మాత్తుగా ఎగువ ఘాట్ రోడ్డు మూసివేసింది.

ఆలయ వేళలను యథావిధిగా కొనసాగించాలా? లేదా దర్శన వేళలను సడలించాలా? అవసరమైతే ఆలయానికి దర్శనాన్ని నిలిపివేయాలా? ఆలయాన్ని మూసివేస్తారా? లేదా అనే అంశాలపై టీటీడీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అత్యున్నత అధికారులంతా కూడా అత్యావసర సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.

See Also | తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కూడా హ్యాండ్ శానిటైజర్స్