Reiki On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ, పవన్ పై దాడికి కుట్ర జరిగిందన్న జనసేన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాఫ్తు జరిపిన తెలంగాణ పోలీసులు.. వివరణ ఇచ్చారు. పవన్ పై కానీ, ఇంటి దగ్గర కానీ ఎలాంటి రెక్కీ చేయలేదని పోలీసులు తేల్చి చెప్పారు. పవన్ పై దాడికి ఎలాంటి కుట్ర జరగలేదని జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. పవన్ ఇంటి దగ్గర న్యూసెన్స్ చేసింది ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా గుర్తించారు పోలీసులు. మద్యం మత్తులో వారు న్యూసెన్స్ చేసినట్లుగా ఆ యువకులు ఒప్పుకున్నారు. పబ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా.. పవన్ ఇంటి దగ్గర కారు ఆపిన యువకులు.. కారుని తీయాలని చెప్పిన పవన్ సెక్యూరిటీతో ఆ యువకులు గొడవపడ్డారు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పవన్ దాడికి కుట్ర జరుగుతోందని, ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జరుగుతున్న ప్రచారానికి తెలంగాణ పోలీసు శాఖ తెరదించినట్లు అయ్యింది. పవన్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని, పవన్ పై దాడికి కుట్ర కూడా జరగలేదని పోలీసు శాఖ వెల్లడించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నివేదికను తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గత నెల 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ సెక్యూరిటీతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. మొత్తంగా పవన్ పై రెక్కీ గానీ, దాడికి కుట్ర గానీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.