తిరుమలలో పాత వాహనాలు నిషేధం

  • Publish Date - November 6, 2020 / 02:19 AM IST

Thirumala Old vehicles ban : తిరుమలలో పాత వాహనాలను నిషేధించారు. కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు.



పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని పేర్కొన్నారు.



రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.



తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు