Pulichintala
Pulichintala project repair : పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతు పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. దీంతో దిగువ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిన ప్రాంతంలో మరమ్మతులు కోనసాగుతున్నాయి. స్టాప్ లాక్ గేటును ఏర్పాటుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో… గేటు బిగించే పనులకు అంతరాయం కల్పిస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది సిబ్బంది.. స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పులిచింతల నుంచి నీటిని దిగువకు వదిలి.. నీటి మట్టం తగ్గిస్తున్నారు. 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 10 టీఎంసీలకు నీటి మట్టం చేరితేనే రిపేర్లు చేసేందుకు అవకాశం ఉండటంతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ నుంచి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు… మరోవైపు పులిచింతల నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది.
దీంతో వరద ముంపు ఉండే 15 మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే విజయవాడలోని పలు కాలనీల్లోకి నీరు చేరుకుంది. దీంతో బాధిత ప్రజలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలిస్తున్నారు.