Pulichintala Project‌ : పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద కొనసాగుతున్న మరమ్మతులు

పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు.

Pulichintala Project

Pulichintala Project‌ repairs : పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణుల బృందం వెళ్లింది. 35 మందితో కూడిన సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్‌ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు.

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నిన్న తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు గేట్లు ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు 16వ గేటు విరిగిపోయిన సంగతి తెలిసిందే. 2 అడుగుల మేర గేట్లు పైకి ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది.

ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో ఒక్క 16 వ నెంబర్ గేటు ద్వారానే అదనంగా దిగువకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. గేటు ఊడటంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు.

సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు.