Ongole Assembly Constituency: బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా.. ఒంగోలు సెగ్మెంట్‌లో ఈసారి టఫ్ ఫైట్ తప్పదా!

ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.

Ongole Assembly Constituency: ఒంగోలు గిత్తల మాదిరిగానే.. అక్కడి రాజకీయం కూడా ఎగసెగసి పడుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. లోకల్ పాలిటిక్స్ ఫుల్ హీటెక్కాయ్. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు బుసలు కొడుతోంది. మరోవైపు.. ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది. అయితే.. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా? లేదా? అనేదే ఆసక్తిగా మారింది. మరోవైపు.. జనసేన కూడా తగ్గేదేలే అంటోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒంగోలు సెగ్మెంట్‌లో ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ (Photos: Facebook)

ఒంగోలు రాజకీయాల ప్రస్తావన వస్తే.. అధికార వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ కుటుంబాలే గుర్తొస్తాయ్. వీళ్లిద్దరి మధ్య.. దశాబ్ద కాలానికి పైగా రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒంగోలు నియోజకవర్గం 1952లో ఏర్పడితే.. 1967 దాకా కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ల హవానే నడిచింది. తర్వాత.. 1983 దాకా కాంగ్రెస్‌కు ఎదురులేకుండా పోయింది. తెలుగుదేశం ఆవిర్భావంతో.. ఒంగోలు రాజకీయాలు (Ongole Politics) కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా నడిచాయ్. 2014 తర్వాత కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. అప్పట్నుంచి.. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఒంగోలు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. 2014లో మొదటిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మళ్లీ గెలిచి.. నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్నారు. ఇక.. ఒంగోలు నియోజకవర్గంలో రెండే రెండు మండలాలున్నాయి. అవి.. ఒంగోలు, కొత్తపట్నం. ఇందులో.. కొత్తపట్నంపై ముందు నుంచి వైసీపీకి గట్టి పట్టుంది. ఒంగోలులో.. టీడీపీకి బలముంది.

బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ (Photos: Facebook)

ఒంగోలు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం (Kamma Community) ఓట్ బ్యాంక్ 36 వేలు, కాపుల ఓట్లు 26 వేలుగా ఉన్నాయి. ఇక్కడ.. అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయడంలో.. ఈ రెండు సామాజికవర్గాలదే కీ రోల్. అయితే.. ఒంగోలు మండలంలో టీడీపీకి అనుకూలంగా ఉండే కమ్మ సామాజికవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో.. తెలుగుదేశం నేత దామచర్ల జనార్దన్ ఫెయిలయ్యారు. ఇది.. బాలినేనికి అనుకూలంగా మారుతూ వస్తోంది. అయితే.. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం.. ఇంతకాలం బాలినేని అండగా ఉన్న కమ్మ సామాజికవర్గం క్రమంగా దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇందుకు.. ఆయన వాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక పోవడమే కారణమంటున్నారు. బీసీ వర్గాలు సైతం ఆయనకు అనుకూలంగా లేవనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలినేనిపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయ్. అవే.. తనకు అనుకూలంగా మారతాయనే అంచనాల్లో టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఉన్నారు. అయితే.. స్థానికంగా పరిస్థితులను అంచనా వేసుకున్నాకే.. బాలినేని వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి.. ఒంగోలు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల నాటికి మొత్తం పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి సచ్చీదేవి

అభ్యర్థిని మార్చాల్సి వస్తే మాత్రం.. ఆమెకే సీటు!
ఒంగోలులో.. అటు టీడీపీ.. ఇటు వైసీపీలో.. ఎలాంటి గ్రూప పాలిటిక్స్ లేవు. అందువల్ల.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్, వైసీపీ నుంచి బాలినేని బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం గనక.. ఎన్నికల నాటికి ఉండే పరిస్థితులను బట్టి.. అభ్యర్థిని మార్చాల్సి వస్తే మాత్రం.. బాలినేని సతీమణి సచ్చీదేవి (Balineni Sachi Devi)కి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఒంగోలులో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నా.. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్ బ్యాంకే కీలకంగా మారుతుంది. అందువల్ల.. ఇక్కడ గనక జనసేన బరిలో నిలిస్తే.. కచ్చితంగా తెలుగుదేశం, వైసీపీపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇక.. పొత్తులేమైనా కుదిరి టీడీపీ, జనసేన గనక కలిసి పోటీ చేస్తే.. వైసీపీకి నష్టం తప్పదనే టాక్ వినిపిస్తోంది.

దామచర్ల జనార్దన్ (Photo: Facebook)

ఇక.. తన హయాంలోనే ఒంగోలు అభివృద్ధి జరిగిందని.. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Janardhana Rao Damacharla) చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో.. ఒంగోలులో గెలిచేది టీడీపీయే అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి.. ఒంగోలును సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.

Also Read: నా వెనుక కుట్ర జరుగుతోంది, ఎలాంటి త్యాగానికైనా సిద్ధం- మాజీమంత్రి బాలినేని సంచలనం

బాలినేని శ్రీనివాసరెడ్డి (Photo: Facebook)

మరోవైపు.. ఇంతకాలం జిల్లా రాజకీయాలను శాసించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy).. మంత్రి పదవి పోయాక.. ఎదురవుతున్న పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఇటీవల ఆయన రీజినల్-కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో.. స్వయంగా జగనే పిలిపించి మాట్లాడారు. ఇక.. బాలినేని వైసీపీలో ఉండరని.. టీడీపీలో గానీ జనసేనలో గానీ చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ.. బాలినేని గనక పార్టీని వీడితే.. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)ని బరిలోకి దించే అవకాశం ఉంది. అయితే.. బాలినేని ఈ ప్రచారాలను ఖండించారు. సొంత పార్టీ నేతలే.. తనపై ఇలాంటివి పుట్టిస్తున్నారని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ తో షేక్ రియాజ్ (Photo: Facebook)

మరోవైపు.. ఒంగోలులో జనసేన (Janasena) కూడా కొంత పుంజుకుంది. పొత్తు ఉన్నా.. లేకపోయినా.. ఇక్కడ విజయం సాధించి తీరతామని.. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒంగోలులో జనసేన గెలిస్తే.. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఒంగోలు రూపురేఖలను మారుస్తామంటున్నారు జనసేన నేతలు. గత ఎన్నికల్లో.. జనసేన తరఫున పోటీ చేసిన షేక్ రియాజే (SK Reyaz).. ఈసారి కూడా బరిలో దిగే అవకాశం ఉంది.

Also Read: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఒంగోలులో టీడీపీ, వైసీపీ మధ్యే అసలు పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య.. నువ్వా-నేనా అన్నట్లుగానే రాజకీయ పోరు సాగుతూ ఉంటుంది. ఇక్కడ.. రెండు పార్టీలకు చెందిన నాయకులు.. స్టేట్‌లో ఎన్నికల నాటికి ఉండే పొలిటికల్ వేవ్, సెంటిమెంట్ పరిస్థితులను క్యాష్ చేసుకొనే గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి నుంచే.. రెండు పార్టీల నాయకులు కొత్త ఎత్తులు వేస్తూ.. మళ్లీ గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎలాంటి సీన్ కనిపిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు