Kuppam Constituency: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?

Kuppam Constituency: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

kuppam assembly constituency : కుప్పం.. ఈ పేరు వినగానే.. ఆల్టర్నేట్‌గా వినిపించే మరో పేరు.. చంద్రబాబు. ఇక్కడి నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచిన చరిత్ర చంద్రబాబుది. ఎన్ని పార్టీలు ట్రై చేసినా.. ఆయనపై ఎంత మంది అభ్యర్థులు పోటీ చేసినా.. బాబు గెలుపుని ఎవరూ ఆపలేకపోతున్నారు. కుప్పం అంటే.. అంత ఈజీ కాదనే అంచనాకొచ్చేశారు. అంతలా కుప్పంతో పెనవేసుకుపోయింది చంద్రబాబు బంధం. అయితే.. ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయనిపిస్తోంది. సొంత ఇలాఖాలోనే.. బాబుకు ప్రతికూల పరిస్థితులు తలెత్తాయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తెలుగుదేశానికి పరాభవం ఎదురైంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఇప్పుడు.. నెక్ట్స్ టార్గెట్ కుప్పంలో చంద్రబాబును ఓడించడమేనని చెబుతోంది అధికార పార్టీ వైసీపీ. దాంతో.. కుప్పంలో చంద్రబాబు బలంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?

Chandrababu Bharath Kuppam

చంద్రబాబు నాయుడు, భరత్‌ (Photos: Twitter)

చిత్తూరు జిల్లాలో.. చివర్లో ఉంటుంది కుప్పం. ఆ కుప్పం.. అసెంబ్లీ నియోజకవర్గంగా 1955లో ఏర్పడింది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. 9 సార్లు తెలుగుదేశమే గెలిచింది. 1983లో తెలుగుదేశం (Telugu Desam Party) ఆవిర్భావం నుంచి మొదలుపెడితే.. ఇప్పటిదాకా పసుపు జెండానే రెపరెపలాడుతోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశానికి.. ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోటగా కుప్పం కొనసాగుతోంది. 1983, 1985లో.. రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు (Chandrababu).. ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించారు. నిజానికి.. బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో కాంగ్రెస్ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత.. కాంగ్రెస్‌ని వీడి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత.. టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం మీదకు చంద్రబాబు ఫోకస్ మళ్లింది. 1989 నుంచి అక్కడే పోటీ చేస్తూ.. గెలుస్తూ వస్తున్నారు. 3 దశాబ్దాలుగా.. కుప్పం ప్రజలు చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో.. 4 మండలాలున్నాయి. అవి.. కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం. కుప్పం పట్టణం.. మున్సిపాలిటీగా ఉంది. వీటి పరిధిలో.. సుమారు రెండు లక్షల 20 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. క్షత్రియుల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వాళ్లు.. 70 వేల దాకా ఉంటారు. వీరితో పాటు బలిజ సామాజికవర్గం ఓటర్లు.. 45 వేల దాకా ఉంటారు. ఒకప్పుడు.. అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఇప్పుడు చంద్రబాబు మార్క్ కనిపిస్తుంది. నియోజకవర్గంలో.. గ్రామస్థాయి నేతలతోనూ బాబుకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లను.. పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుని.. తమవాడిగానే భావిస్తారు. ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా.. భారీ మెజారిటీతో గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం.. కుప్పం మెజారిటీతోనే.. చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

Chandrababu Naidu

నారా చంద్రబాబు నాయుడు (Photo: Twitter)

35 ఏళ్లుగా.. చంద్రబాబుపై ఎవరు పోటీ చేసినా.. ఆయన్ని ఓడించలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు బాబుకు.. ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండేవారు. 2014 నుంచి.. వైసీపీ తరఫున కొత్త ప్రత్యర్థి తెరమీదికొచ్చారు. ఆయనే.. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి. గత రెండు ఎన్నికల్లో.. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి.. రెండో స్థానానికే పరిమితమయ్యారు. కుప్పంలో వన్నె కుల సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. అదే సామాజికవర్గానికి చెందిన చంద్రమౌళిని.. జగన్ వ్యూహాత్మకంగా బరిలో దించారు. కానీ.. రెండు సార్లు ఆయన బాబుపై గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో 55 వేల ఓట్లు, 2019లో 70 వేల ఓట్లు సాధించిన చంద్రమౌళి.. చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో బాబుకు.. కేవలం 30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక.. చంద్రబాబుపై పోటీ చేసి 50 వేలకు పైగా ఓట్లు సాధించిన తొలి ప్రత్యర్థి.. చంద్రమౌళి మాత్రమే. ఇది.. వైసీపీలో కొత్త ఉత్సాహం నింపింది. దాంతో.. ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే.. కుప్పంలో బాబును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాలు వైసీపీ (YCP) నేతల్లో మొదలయ్యాయి.

KRJ Bharath Kuppam

భరత్‌ (Photo: Twitter)

గత ఎన్నికల తర్వాత.. చంద్రమౌళి (Chandramouli) అనారోగ్యంతో మరణించడంతో.. ఆయన కుమారుడు భరత్‌కు కుప్పం బాధ్యతలు అప్పజెప్పింది వైసీపీ నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో.. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా.. అధికార వైసీపీ ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. తర్వాత.. కుప్పంపై ఫోకస్ పెంచిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఇంచార్జ్ భరత్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ 70 శాతం స్థానాలు గెలుచుకునేలా పావులు కదిపారు. ఇక.. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం (kuppam) మున్సిపాలిటీపైనా.. వైసీపీ జెండా ఎగిరింది. దాంతో.. వైసీపీ ఇంచార్జ్ భరత్‌ను.. ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. తర్వాత.. చిత్తూరు వైసీపీ అధ్యక్షుడిగానూ భరత్‌ని ఎంపిక చేసింది అధిష్టానం. అప్పట్నుంచి.. ఆయన మరింత డోస్ పెంచారు. 30 ఏళ్లుగా.. కుప్పంకు చంద్రబాబు చేసిందేమీ లేదంటున్నారు వైసీపీ ఇంచార్జ్ భరత్. నియోజకవర్గంలో టీడీపీ నేతలు మాత్రమే బాగుపడ్డారని చెబుతున్నారు. దొంగ ఓట్లతోనే చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read: ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిరినట్లేనా.. టీడీపీ, జనసేన నుంచి బరిలో దిగేదెవరు?

Srikanth Kancharla

కంచర్ల శ్రీకాంత్‌ (Photo: Twitter)

వైసీపీ ఫోకస్ పెంచాక.. కుప్పంలో పరిస్థితులు మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాల్లోకి.. వైసీపీ అడుగు పెట్టింది. కుప్పం ప్రజలకు సరైన ఉపాధి కల్పించకపోవడం వల్లే.. వాళ్లంతా బెంగళూరుకు పనులకు వెళ్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ దూకుడు గమనించిన చంద్రబాబుబు.. కుప్పంపై ఫోకస్ పెంచారు. 3 నెలలకోసారి.. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో సొంతింటి నిర్మాణానికి పునాది వేశారు. కుప్పం పరిణామాలు.. చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీశాయి. అవసరమైతే.. తాను పుంగనూరు వదిలి.. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra Reddy) సవాల్ విసరడం.. అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా.. కుప్పం పరిణామాలు.. అక్కడి ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది. ఇక.. నియోజకవర్గానికి సంబంధింది.. బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం టీడీపీ వ్యవహారాలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్‌ (Srikanth Kancharla) కు అప్పగించారు. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటు చేసిన కుప్పం ఎన్నికల కమిటీకి.. ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ని నియమించారు. కుప్పంలో.. చంద్రబాబు లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పంలోనే పర్యటించనున్నారు.

Also Read: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

ఇప్పటిదాకా కుప్పంలో చంద్రబాబుకు పెద్దగా పోటీ అనేది కనిపించలేదు. కానీ.. ఈసారి ఎన్నికల్లో.. టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోరు ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల.. ఇక్కడ మిగతా పార్టీల ప్రభావం పెద్దగా ఉండదు. ఇక.. 3 నెలలకోసారి కుప్పంకు వస్తూ.. క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు చంద్రబాబు. వైసీపీ ఇంచార్జ్ భరత్ (KRJ Bharath) సైతం.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. కుప్పం వైసీపీలోనూ గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సొంత పార్టీలోనే.. భరత్‌కు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి బరిలో ఉండబోయేది భరతేనని చెప్పినా.. స్థానికంగా పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి శిష్యుడు సెంథిల్ కుమార్.. ముందు నుంచి కుప్పంలో యాక్టివ్‌గా ఉన్నారు. సెంథిల్‌కు, భరత్‌కు మధ్య పొసగడం లేదు. ఆయన.. భరత్‌తో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. పైగా.. వచ్చే ఎన్నికల్లో కుప్పం వైసీపీ టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా.. మంత్రి పెద్దిరెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలన్నీ.. భరత్‌ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా.. ఈసారి కుప్పం పోరు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందనడంలో.. ఎలాంటి సందేహం లేదు. 1999 ఎన్నికల తర్వాత కుప్పంలో.. చంద్రబాబు మెజారిటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరి.. ఈసారి చంద్రబాబు మెజారిటీ విషయం పక్కనబెడితే.. ఇక్కడ మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురుతుందా? కొత్త సీన్ ఏమైనా కనిపిస్తుందా? అనేది.. ఆసక్తి రేపుతోంది.