Chirala Assembly Constituency: ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిరినట్లేనా.. టీడీపీ, జనసేన నుంచి బరిలో దిగేదెవరు?

మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.

Chirala Assembly Constituency: ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిరినట్లేనా.. టీడీపీ, జనసేన నుంచి బరిలో దిగేదెవరు?

Chirala Assembly Constituency: ఎంతో మంది ప్రముఖులను అసెంబ్లీకి పంపిన చరిత్ర చీరాలది. అయితే అక్కడ ఒకప్పటి రాజకీయాలు వేరు.. ఇప్పుడు వేరు. పార్టీలు, ప్రజల కంటే నేతలకు సొంత ప్రాధాన్యతే ఎక్కువైంది. అందుకే గెలిచినోళ్లు.. గెలిచినట్లే గోడ దూకేస్తున్నారు. గత ఎన్నికల్లో అలాంటి నేతలకు షాక్‌ ఇచ్చిన చీరాల ఓటర్లు.. ఈసారి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిరినట్లేనా? టీడీపీ, జనసేన నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు? అభ్యర్థి గెలుపులో కాపు ఓట్లే కీలకం కాబోతున్నాయా? చీరాలలో ఈసారి పొలిటికల్ సీనేంటి?

చీరాల.. హాట్ హాట్ రాజకీయాలకు పేరుమోసిన నియోజకవర్గం. మాజీ గవర్నర్‌, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రిగా పాలేటి రామారావు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1921 ఏప్రిల్ 6న చీరాలలో.. చీరాల పేరాలా ఉద్యమం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రనే మార్చింది. అంతటి ఘన చరిత్ర కలిగింది చీరాల. చేనేత, జీడిపరిశ్రమలకు పెట్టింది కోట. అప్పట్లో చీరాలలో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి. రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడు ఈసారి తాను రిటైర్‌మెంట్ తీసుకోని ఎలాగైనా సరే తన వారుసున్ని రంగంలోకి దింపి వైసీపీ జెండాను ఎగరవేయాని ఉవ్విళ్లూరుతుండగా.. పార్టీకి కంచుకోటగా మారిన చీరాలను మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీడీపీ స్కెచ్ వేస్తోంది. హాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మరో నాయకుడు ఇప్పడు వేరే దారిని చూసుకోవడంతో పరిస్థితులు చూడటానికి స్థబ్ధుగా రాజకీయాలు సాగుతున్నట్లు కనబడుతున్నా… లోలోపల మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు కోసం పట్టు బిగించేందుకు ఆయా పార్టీలు ఇప్పటినుంచే బలాబలాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Karanam Balaram Krishna Murthy

కరణం బలరాం (Photo: FB)

సనాతనకాలం నుంచి చేనేత వృత్తిపై ఆధారపడిన వేల కుటుంబాలు నేటికి చీరాలలో చేనేత కార్మికులు తమ పెద్దల వారసత్వాన్నే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. 1952లో చీరాల నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ప్రముఖులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రగాడ కోటయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇదే నియోజకవర్గం మాజీ గవర్నర్‌, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య రెండుసార్లు విజయం సాధించారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి రోశయ్యపై బరిలో నిలిచిన పాలేటి రామారావు రెండు సార్లు విజయం సాధించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. రోశయ్య వారసుడిగా చీరాల బాధ్యతలను స్వీకరించిన ఆమంచి కృష్ణమోహన్‌… 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిస్థితులతో చీరాల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి నవోదయ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్‌ రెండోసారి విజయం సాధించారు. అలా రెండు సార్లు విజయం సాధించిన ఆమంచి మాస్‌ పొలిటికల్ లీడర్‌గా పేరు సంపాదించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్‌బై చెప్పి… వైసీపీలో చేరారు ఆమంచి కృష్ణమోహన్‌. 2014 ఎన్నికల్లో అద్దంకిలో ఓటమిపాలైన కరణం బలరాంను 2019 ఎన్నికల్లో చీరాల నుంచి బరిలో దింపారు. కరణం బలరాం ఎంట్రీతో చీరాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Karanam Venkatesh, YS Jagan

వైఎస్ జగన్ తో కరణం వెంకటేశ్ (Photo: FB)

ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కరణం బలరాం(Karanam Balaram) అలుపెరగని రాజకీయ నేత. ప్రత్యర్థులకు లయన్‌గా సుధీర్ఘకాలం ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. తన మాటే శాసనంగా బలరాం పేరు తెచ్చుకున్నారు. 26 ఏళ్ల వయసులోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. 32 ఏళ్లలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఒంగోలు(Ongole) లోక్‌సభ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో నాయకుడికి భరోసాగా నిలబడ్డారు. 2004లో వైఎస్ఆర్‌ హయాంలో ప్రకాశం జిల్లా నుంచి కేవలం కరణం బలరాం మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ సునామీలోనూ చీరాల అసెంబ్లీ నుంచి మరోసారి బలరాం గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కరణం బలరాంపై ఆమంచి కృష్ణమోహన్‌ ఓటమిపాలయ్యారు. దీంతో నిత్యం చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు, ఘర్షణలు జరుగుతుండేవి. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం… ఆ తర్వాత వైసీపీపక్షాన చేరిపోయారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడమన్నట్లు ఇద్దరూ వైసీపీలో ఉన్నప్పటికీ ఘర్షణలు మాత్రం కంటిన్యూ అయ్యేవి. దీంతో రంగంలోకి దిగి వైసీపీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా కరణం కుమారుడు వెంకటేశ్‌(Karanam Venkatesh), పర్చూరు సమన్వయకర్తగా ఆమంచిని నియమించడంతో గొడవ సద్దుమణిగింది. వచ్చే ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్‌ పేరు దాదాపు ఖరారైంది.

Amanchi Krishna Mohan

ఆమంచి కృష్ణమోహన్‌ (Photo: FB)

చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం రెండు మండలాలు ఉన్నాయి. ఆమంచి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు టీడీపీకి మంచి పట్టు ఉంది. ఆమంచి ఎంట్రీతో చీరాల ఆయన అడ్డాగా మారింది. మండలాల వారీగా రాజకీయ బలాబలాలు చూస్తే… వేటపాలెం మండలంలో అత్యధికంగా ఉన్న దేవాంగ, పద్మశాలి (Padmasali) సామాజిక వర్గాలు టీడీపీ ఆవిర్భావం నుంచి నేటికి విరాభిమానులుగా ఉన్నారు. చీరాల మండలంలో వైసీపీ, టీడీపీకి సమానంగా తన పట్టును నిలుపుకుంటున్నారు. దీంతో మరోసారి చీరాలలో గెలిచేది టీడీపీనేనని చంద్రబాబు క్లారిటీకి వచ్చారు. మరోవైపు ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిర్చినప్పటికి వారు మాత్రం రెండు వర్గాలుగానే ఉన్నారు. చీరాలలో ఆమంచి కృష్ణ మోహన్(Amanchi Krishna Mohan) ఓటు బ్యాంక్ వైసీపీ విజయంలో కీలకం కానుంది. దీనిని ముందుగానే ఊహించిన కరణం బలరాం… అధిష్టానంతో సయోధ్య కుదిర్చిన అనంతరం ఆమంచి వర్గానికి చెందిన పలువురు కార్పోరేటర్లను తమ వైపునకు తిప్పుకునేలా ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల్లో చీరాలలో గెలుపే లక్ష్యంగా కరణం బలరాం కుమారుడు వెంకటేశ్ ముందుకువెళ్తున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందంటున్నారు కరణం వెంకటేశ్‌.

Also Read: విజయనగరంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. రాజుల ఖిల్లాలో పాగా వేసేదెవరు?

MM Kondaiah

కొండయ్య (Photo: FB)

ప్రస్తుతం కొండయ్య(Kondaiah) చీరాల టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నా…. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామంటూ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు. విజయం కోసం సీరియస్‌గా ప్రయత్నించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు చీరాల బరిలో నిలిచే సీటు విషయంలో టీడీపీ అధిష్టానం భరోసా ఇవ్వకపోవడము ఒక కారణం. దీంతో చీరాలలో టీడీపీ క్యాండెట్‌ను మార్చవచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది. దీంతో చీరాల టీడీపీ సీటు కోసం ప్రస్తుతం ఎడం బాలాజీ, మాజీ ఎమ్మెల్యే సజ్జా చంద్రమౌళి(sajja chandramouli) కోడలు హేమలత, నెల్లూరు సీఐడీ డిఎస్పీగా చేసిన కొమ్మనబోయిన నాగేశ్వరరావు(kommanaboina nageswara rao) ఆశిస్తున్నారు. మరోవైపు జనసేనతో టీడీపీకి పొత్తు కుదిరితే జనసేనకు ఈ సీటును కేటాయించబోతున్నారనే చర్చ సైతం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక్కడ జనసేన నుంచి బరిలో దిగాలనే భావనతో ఆమంచి కుటుంబం ఉంది. స్థానికంగా బలంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్, జనసేన సానుభూతిపరులు, సాలీడ్‌గా ఉన్న ఆమంచి వర్గానికి చెందిన 40 వేల ఓటర్లు.. ఈ మూడు వర్గాల ఓటు ఏకమైతే జనసేనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

ఒకవేళ జనసేనతో పొత్తు కుదరకపోతే వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన మూడో స్థానానికి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. చీరాలలో జనసేన (Janasena Party), బీజేపీకి క్యాడర్ లేకపోవడమే అందుకు కారణం. చీరాలలో కమ్యూనిస్టుల ప్రభావం పెద్దగా లేదు. చీరాల బరిలో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా.. పర్చూర్ వైసీపీ వ్యూహం బెడిసి కొడితే మాత్రం మినీ ముంభైలో మూడు ముక్కలాట తప్పేట్లు లేదు. అలాకాకుండా జనసేన, టీడీపీ పార్టీల మధ్య పొత్తు పొడిస్తే వైసీపీకి మరోసారి చీరాల ఆశాభంగం తప్పదు. మరి చూడాలి చీరాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.