Nellore City Constituency: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

నెల్లూరు పాలిటిక్స్ ఎంత హీట్ పుట్టిస్తాయో.. అంతే ఇంట్రస్టింగ్‌గానూ ఉంటాయ్. నెల్లూరు పెద్దారెడ్లు చేసే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు.

Nellore City Constituency: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

Nellore City Assembly Constituency: రాష్ట్ర రాజకీయాలనే కాదు.. దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఉన్న జిల్లా నెల్లూరు. నెల్లూరంటే చేపల పులుసుకే కాదు.. అందులోని మసాలా ఘాటు లాంటి రాజకీయానికి కూడా ఫేమస్. జిల్లాలో ప్రతి సీటులోనూ పొలిటికల్ హీటు కనిపిస్తుంది. అందులో.. నెల్లూరు సిటీ సెగ్మెంట్‌లో రాజకీయ వేడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో.. వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. ఇద్దరు మాజీ మంత్రులు.. నువ్వా – నేనా అనే స్థాయిలో తలపడబోతున్నారు. ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్‌కి.. సైలెంట్ లీడర్ నారాయణ మధ్యే.. అసలైన పోటీ ఉండబోతోంది. దాంతో.. జిల్లాలో అందరి చూపు ఈ సెగ్మెంట్ మీదే ఉంది. అయితే.. నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా? లేదా? అన్నదే.. బిగ్ క్వశ్చన్ మార్క్.

నెల్లూరు పాలిటిక్స్(nellore politics) ఎంత హీట్ పుట్టిస్తాయో.. అంతే ఇంట్రస్టింగ్‌గానూ ఉంటాయ్. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడూ హీట్ వాతావరణం కొనసాగుతుంది. ఇక.. నెల్లూరు పెద్దారెడ్లు చేసే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ.. ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారింది. 2014 నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్‌లో మొత్తం 28 డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో లక్షా 56 వేల పైనే ఓటర్లున్నారు. ఈ సీటులో.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న ఆనం కుటుంబీకులే.. ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014, 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్.. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆంధ్రా రాజకీయాల్లో నెల్లూరు అంటే.. వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో.. జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతకుముందు 2014 ఎన్నికల్లోనూ.. వైసీపీ(YCP) ఏడు స్థానాలు గెలిచింది. కానీ.. ఈసారి ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి దూరంగా జరగడంతో.. మొత్తం పొలిటికల్ సీనే మారిపోనుంది. పైగా.. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో.. జిల్లాలో ఆ పార్టీకి కొంత గ్రాఫ్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. దాంతో.. రాబోయే ఎన్నికల్లో.. వైసీపీ, టీడీపీ మధ్య పోరు.. మామూలుగా ఉండదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా.. నెల్లూరు సిటీలో.. పొలిటికల్ వార్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే చర్చ సాగుతోంది. ఈసారి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పొంగూరు నారాయణ మధ్యే పోటీ ఉంటుందని చర్చించుకుంటున్నారు.

Anil Kumar Yadav (FB Image)

అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav).. ప్రస్తుతం నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే.. వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. మూడోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అనిల్‌.. సీఎం జగన్‌కు విధేయుడనే పేరుంది. అందువల్ల.. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెల్లూరు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనిల్ కుమార్ దూకుడుగా కనిపించినా.. మంచి పేరే ఉంది. నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని చెబుతున్నారు. ఇవే.. ఆయన్ని గెలిపిస్తాయని.. వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే.. కొందరు కార్పొరేటర్లు అనిల్‌ని వీడటం, అధికార పార్టీలో ఉన్న గ్రూపులు, అలాగే.. బాబాయ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌తో ఉన్న విభేదాలు, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ (Mukkala Dwarakanath) కూడా అనిల్‌కు దూరమవడం.. కొంత మైనస్‌గా భావిస్తున్నారు. మరోవైపు.. నెల్లూరు పెద్దారెడ్లు కూడా అనిల్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అనిల్ వ్యవహారశైలి.. చాలా మంది సీనియర్లకు కూడా నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది.

Mukkala Dwarakanath

Mukkala Dwarakanath (FB Image)

దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాలను శాసిస్తుంది రెడ్లే. వాళ్ల సపోర్ట్ లేకుండా రాజకీయంగా మనుగడ సాధించడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ.. బీసీ నేతగా రాజకీయాల్లో ఎదిగిన అనిల్.. మంత్రి పదవి పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. మంత్రిగా ఉన్నప్పుడు పెద్దారెడ్లకు, సీనియర్లకు.. అనిల్ అంతగా గౌరవం, మర్యాద ఇచ్చేవారు కాదనే విమర్శలున్నాయ్. ఆనం, కాకాణి లాంటి నేతలను కూడా వారి నియోజకవర్గాలకే పరిమితం చేశారనే వాదన ఉంది. ఇప్పటికీ.. మంత్రి కాకాణితో అనిల్‌కు విభేదాలున్నాయనే ప్రచారం సాగుతోంది. జిల్లాలో ఉన్న రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. ఏ పార్టీలో ఉన్నా.. అవసరమనుకున్నప్పుడు అంతా ఏకమవుతారనే టాక్ నెల్లూరు పాలిటిక్స్‌లో వినిపిస్తుంటుంది. ఇప్పుడు.. నెల్లూరు పెద్దారెడ్లందరి ఉమ్మడి టార్గెట్‌ అనిల్ కుమారే అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కొన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ.. అనిల్ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. తనకు.. సీఎం జగన్‌తో పాటు నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులుంటే చాలు.. ఈజీగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

మరోవైపు.. నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు వైశ్య కమ్యూనిటీలో మంచి పట్టుంది. గతంలో ద్వారకానాథ్‌కు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదు. అలాగే.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.

Also Read: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

ponguru narayana

ponguru narayana (photo: google)

ఇక.. తెలుగుదేశం విషయానికొస్తే.. నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్.. పొంగూరు నారాయణ(ponguru narayana).. నెల్లూరు సిటీ బరిలో దిగడం ఖాయంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి.. కేవలం 1988 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీడీపీ(TDP) హయాంలో.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నెల్లూరు సిటీ సెగ్మెంట్ పరిధిలో.. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారనే టాక్ ఉంది. పైగా.. ఇక్కడి ప్రజలకు ఆయనపై కొంత సానుభూతి ఉంది. దానికితోడు.. బలమైన టీడీపీ క్యాడర్ ఉంది. సౌమ్యుడిగానూ, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుపోయే వ్యక్తిగా నారాయణకు పేరుంది. అయితే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. నారాయణ టీడీపీ నేతలను పూర్తిగా దూరం పెట్టారు. సొంత పార్టీ నేతల వల్లే తాను ఓడిపోయానని ఆయన భావించారు. మరోవైపు.. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు, సీఐడీ ఎంక్వైరీలతో చాలాకాలంగా నారాయణ జిల్లాకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే.. ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గతంలో జరిగిన తప్పులు.. మళ్లీ జరగకుండా జాగ్రత్తపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే.. కలిసొస్తుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు(nellore) వచ్చిన ప్రతిసారీ.. తెలుగుదేశం సీనియర్లు, ఇతర నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓడిన చోటే.. గెలిచి తీరాలనే పట్టుదల నారాయణలో కనిపిస్తోంది.

Also Read: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

Kethamreddy Vinod Reddy

Kethamreddy Vinod Reddy (FB Image)

నెల్లూరు సిటీలో జనసేన(janasena) కూడా బలంగానే ఉంది. టీడీపీతో గనక పొత్తు కుదిరి.. నెల్లూరు సిటీ సీటును జనసేనకు కేటాయిస్తే.. పోటీ చేసేందుకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి(Kethamreddy Vinod Reddy), మనుక్రాంత్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వినోద్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటే.. మనుక్రాంత్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. కేతంరెడ్డి.. 10 నెలలుగా.. పవన్ అన్న బాట పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఏదేమైనా.. ఈసారి నెల్లూరు సిటీలో ఎన్నికల పోరు.. హోరాహోరీగా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది. టీడీపీ తరఫున పొంగూరు నారాయణ పోటీ చేయడం దాదాపు ఖాయం. అందువల్ల.. ఆయన్ని ఢీకొట్టాలంటే.. ఆ స్థాయి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తప్ప.. మరొకరు వైసీపీకి కనిపించడం లేదు. దాంతో.. ఈసారి నెల్లూరు సిటీలో అనిల్, నారాయణ మధ్యే.. ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.