Vizianagaram Constituency: విజయనగరంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. రాజుల ఖిల్లాలో పాగా వేసేదెవరు?

ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?

Vizianagaram Constituency: విజయనగరంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. రాజుల ఖిల్లాలో పాగా వేసేదెవరు?

vizianagaram assembly constituency: సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకొని ఒకరు.. ప్రభుత్వ వ్యతిరేకతే కలిసొస్తుందని మరొకరు. విజయనగరం నియోజకవర్గంలో.. నేతలు ఎవరి ధీమాలో వాళ్లుంటే.. క్యాడర్ మాత్రం కన్ఫ్యూజన్‌తో కిందా మీదా పడుతోంది. నిత్యం జనంలోనే ఉంటున్నా.. ఎంతో చేస్తున్నామని చెబుతున్నా.. అధికార పార్టీ నేతలకు ఓటమి భయం వెంటాడుతోంది. మరోవైపు.. కేవలం తన నివాసానికే పరిమితమైన ప్రతిపక్ష నేత మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇలాంటి భిన్నమైన రాజకీయ పరిస్థితులున్న విజయనగరం నియోజకవర్గంలో.. గెలుపు గుర్రం ఎక్కేదెవరున్న దానిపైనే జోరుగా చర్చ సాగుతోంది. సొంత ఇమేజ్‌ని నమ్ముకొని ఒకరుంటే.. వారసత్వ రాజకీయంపై మరొకరు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?

Meesala GeethaPusapati Ashok Gajapathi Raju Kolagatla Veerabhadra Swamy

మీసాల గీత, అశోక్ గజపతిరాజు, కోలగట్ల

విజయనగరం (vizianagaram) రాజుల ఖిల్లాగా పేరొందిన అసెంబ్లీ సెగ్మెంట్. ఇలాంటి.. నియోజకవర్గంలో.. మొట్టమొదటిసారి.. ఫ్యాన్ గిర్రున తిరిగింది. వైసీపీ వేవ్‌లో.. టీడీపీ కంచుకోట బద్దలైంది. అలాంటి చోట.. తాజా రాజకీయ పరిస్థితులు.. చర్చనీయాంశంగా మారాయ్. రాబోయే.. ఎన్నికల్లో గెలిచేదెవరన్నది.. ఆసక్తి రేపుతోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్‌పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy). పైకి.. ఆయనలో గెలుపు ధీమా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఓటమి భయం వెంటాడుతోందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. గత నాలుగేళ్లుగా తన బంగ్లాకే పరిమితమైన టీడీపీ నేత అశోక్ గజపతిరాజు మాత్రం.. గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో.. ఏ అసెంబ్లీ స్థానంలో లేని రాజకీయ పరిస్థితులు.. ఇక్కడ నెలకొనడంపై.. ఆసక్తికర చర్చ సాగుతోంది.

విజయనగరం పొలిటికల్ హిస్టరీ ఓసారి చూస్తే.. 1952లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 1978 వరకు.. వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ గజపతి రాజు.. 1983 నుంచి 1999 వరకు వరుసగా.. ఐదు సార్లు తెలుగుదేశం నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తంగా.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. విజయనగరం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం విజయనగరం. పట్టణంతో పాటు మండల పరిధిలో.. 2 లక్షల 30 వేల మందికి పైనే ఓటర్లున్నారు. వీరిలో.. బీసీల ఓట్ బ్యాంక్.. ఎక్కువగా ఉంటుంది. వాళ్లే ఇక్కడ గెలుపోటములను నిర్దేశిస్తుంటారు. గత ఎన్నికల్లో.. తొలిసారి వైసీపీ ఇక్కడ గెలుపు జెండా ఎగరేసింది. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుపై 6 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో.. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు.

Kolagatla Veerabhadra Swamy

కోలగట్ల వీరభద్రస్వామి (Photo: FB)

విజయనగరంలో కోలగట్ల అంటే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయన పనితీరులో మార్పు ఉండదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే ఇమేజ్.. ఆయనకు బిగ్ ప్లస్ పాయింట్. నమ్మకమైన అనుచరులే.. ఆయన బలమనే టాక్ కూడా ఉంది. గత నాలుగేళ్లుగా.. తన పనితీరుతో.. ఎమ్మెల్యేగా తన ట్రాక్ రికార్డును.. బాగానే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కోలగట్ల. అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతపై జరుగుతున్న చర్చ.. వీరభద్రస్వామని టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో.. ఆయనలో భయాలు రెట్టింపు అయ్యాయంటున్నారు. రాజకీయంగా సొంతంగా ఎంత ఇమేజ్ సంపాదించుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలు.. తనకు తగులుతాయేమోనన్న ఆందోళన ఆయనలో ఉందనే వాదన వినిపిస్తోంది.

మరోవైపు.. బీసీలు ఎక్కువగా ఉండే విజయనగరం (vizianagaram) స్థానంలో.. వచ్చే ఎన్నికల్లో బీసీలకే టికెట్ ఇవ్వాలంటూ.. సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు కూడా కోలగట్లను టెన్షన్ పెడుతున్నాయి. మంత్రి బొత్సతో ఉన్న వర్గ విభేదాలు బయటకు కనిపించకపోయినా.. ఎన్నికల సమయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశముందనే టాక్ నడుస్తోంది. అన్నింటికీ మించి.. ఈసారి టీడీపీ తరఫున నేరుగా అశోక్ గజపతిరాజే పోటీ చేస్తారన్న ప్రచారంతో.. కోలగట్ల అలర్ట్ అయ్యారు. సొంత పార్టీలో గ్రూప్ తగాదాలు, మరోవైపు బీసీ నినాదం (BC Slogan) లాంటివి.. కోలగట్లకు ఛాలెంజ్‌గా మారే చాన్స్ ఉందంటున్నారు. గత ఎన్నికల్లోనే.. అశోక్ గజపతి కూతురు అదితి కాకుండా.. ఆయనే నేరుగా పోటీ చేసి ఉంటే.. వీరభద్రస్వామికి ఓటమి తప్పేది కాదన్న వాదన ఉంది. ఇప్పుడిదే అంశం.. లోకల్ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది.

మరోవైపు.. గత నాలుగేళ్లుగా తన బంగ్లాకే పరిమితమైన అశోక్ గజపతిరాజు గెలుపుపై.. తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున అశోక్ గజపతి పోటీ ఖరారైందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో.. ఈసారి ప్రయోగాలకు తావు లేకుండా.. నేరుగా అశోక్ గజపతినే బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు.. టికెట్ విషయంలో బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. రాజు గారు బరిలో దిగితే.. తెలుగుదేశం(Telugu Desam Party) గెలుపు ఖాయమని.. పార్టీ క్యాడర్ ఫుల్ ఖుషీలో ఉంది. మరోవైపు.. అశోక్ గజపతిరాజు కూడా వైసీపీ పాలనపై అవకాశం చిక్కినప్పుడల్లా.. ఘాటు విమర్శలు సంధిస్తున్నారు.

Also Read: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

Pusapati Ashok Gajapathi Raju

అశోక్ గజపతిరాజు (Photo: FB)

బంగ్లాకే పరిమితమైన గజపతిరాజు
నిజానికి.. గత ఎన్నికల్లో తన కూతురు ఓటమి తర్వాత.. అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) జనం మధ్యకు పెద్దగా వెళ్లిన దాఖలాల్లేవు. ప్రతిపక్ష నేతగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ అంత చురుగ్గా పాల్గొనలేదు. బంగ్లాకే పరిమితమై.. పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అంతకుమించి.. నేరుగా ప్రజాక్షేత్రంలో వైసీపీ పాలనను ఎండగట్టిన సీన్లు చాలా తక్కువ. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలుస్తారని తెలుగుదేశం క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోందంటే.. అందుకు అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతేనని చెబుతున్నారు. వీటికి తోడు.. మా ఊరి రాజుగారు అనే లోకల్ సెంటిమెంటు ఉండనే ఉంది. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతగా ఆయనకున్న గుర్తింపు.. మరింత కలిసొస్తుందని.. తెలుగు తమ్ముళ్లు గట్టిగా నమ్ముతున్నారు.

Also Read: ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్.. అనకాపల్లిలో రసవత్తరంగా రాజకీయం!

Meesala Geetha

మీసాల గీత (Photo: FB)

గజపతిరాజుకు వ్యతిరేక వర్గం
మరోవైపు.. అశోక్ గజపతిరాజుకు వ్యతిరేక వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత(Meesala Geetha) పరిస్థితి అయోమయంగా మారింది. తెలుగుదేశం సీటు రాజుగారికి ఫిక్స్ అవడంతో.. ఆమె ఆశలన్నీ గల్లంతైపోయాయ్. నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన ఆమె.. పార్టీలో తన భవిష్యత్ ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. గత ఎన్నికల్లోనే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో.. అప్పటి నుంచి అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా మారారు. సొంతంగా పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించి.. హల్‌చల్ చేశారు. అయినా.. ఆమెకు టికెట్ విషయంలో పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు.. టికెట్ విషయంలో లోకేశ్‌ (Lokesh)ని నమ్ముకొనే ఉన్నారు. ఒకవేళ.. ఆమెకు పోటీ చేసే అవకాశం రాకపోతే.. ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. ప్రజల్లో ఉంటూ అభివృద్ధి మంత్రం జపిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను.. ఓటమి భయం వెంటాడుతుంటే.. బంగ్లాకే పరిమితమై.. జనంతో అంతగా కలవని టీడీపీ (TDP) నేత మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇవే పరిస్థితులు.. వచ్చే ఎన్నికల దాకా ఉంటాయా? అప్పటివరకు రాజకీయ సమీకరణాలేమైనా మారిపోతాయా? అనేది ఆసక్తిగా మారింది.