Anakapalli Constituency: ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్.. అనకాపల్లిలో రసవత్తరంగా రాజకీయం!

గెలవడం సంగతి పక్కనబెడితే.. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా.. ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనకాపల్లి రాజకీయం.. ఇంత రసవత్తరంగా మారడం వెనుక కారణాలేంటి?

Anakapalli Constituency: ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్.. అనకాపల్లిలో రసవత్తరంగా రాజకీయం!

Anakapalli Assembly Constituency: అనకాపల్లి.. ఏపీలో ఉత్తరం వైపు ఏదైనా హాట్ సీటు ఉందంటే.. అది ఇదే. కానీ.. ఈ సిట్టింగ్ సీటును.. మంత్రి గుడివాడ అమర్నాథ్ గాలికొదిలేశారు. మరోసారి.. అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనే ఆయనకు లేదంటున్నారు. దాంతో.. తెలుగుదేశంలో కొత్త ఆశలు రేకెత్తాయ్. గెలిచేందుకు చాన్స్ ఉందనే అంచనాలతో.. జనంలోకి వెళ్తున్నారు పసుపు పార్టీ నేతలు. మరోవైపు.. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన దాడి ఫ్యామిలీ అనకాపల్లినే నమ్ముకొని ఉంది. గెలవడం సంగతి పక్కనబెడితే.. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా.. ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనకాపల్లి రాజకీయం.. ఇంత రసవత్తరంగా మారడం వెనుక కారణాలేంటి? ఏయే పార్టీల నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు. ఓవరాల్‌గా.. ఈసారి అనకాపల్లి సెగ్మెంట్‌లో కనిపించబోయే సీనేంటి?

గ్రేటర్ విశాఖలో.. పొలిటికల్ మీటర్ పెంచే సీటు అనకాపల్లి. అనకాపల్లి టౌన్‌తో పాటు కశింకోట, అనకాపల్లి రూరల్ గ్రామాలు.. ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయ్. ఇక్కడ.. కాపు, గవర ప్రధాన సామాజికవర్గాలుగా ఉన్నాయి. ఇప్పటిదాకా.. అనకాపల్లి రాజకీయాల్లో వీళ్ల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. 1952లో ఏర్పడిన అనకాపల్లి నియోజకవర్గం.. తెలుగదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత.. పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అలా.. 2004 దాకా అనకాపల్లిలో పసుపు జెండా మాత్రమే ఎగిరింది. 2004 ఎన్నికల్లో.. దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో.. కొత్త పార్టీ అభ్యర్థులకు పట్టం కడుతూ వస్తున్నారు ఇక్కడి ఓటర్లు.

Gudivada, Dadi, Peela
ఈ సెగ్మెంట్‌లో మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు.. సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. అనకాపల్లి టీడీపీ కంచుకోటగా ఉన్న టైమ్‌లో.. దాడి వీరభద్రరావు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ తరఫున కొణతాల రామకృష్ణ(konathala ramakrishna) ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున గంటా శ్రీనివాసరావు గెలిచారు. నాన్ లోకల్ అయినప్పటికీ కాపు ఫ్యాక్టర్‌తో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో గంటాకు మంత్రిగా అవకాశం రావడంతో.. నియోజకవర్గంపై ఆయన పట్టు పెరిగింది. ఇదే సమయంలో కొణతాల, దాడి కుటుంబాల ప్రభావం తగ్గుతూ వచ్చింది. గంటా అనకాపల్లిని వదిలేసి వెళ్లినా.. దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ.. రాజకీయంగా ప్రభావం చూపలేకపోయారు. దాడి తెలుగుదేశం నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. కొణతాల ఎటూ తేల్చుకోలేక.. తెలుగుదేశానికి మద్దతుగా నిలబడ్డారు. ఇక.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలుపులో.. కాపు ఓటర్లు కీలకంగా ఉన్నారనే టాక్ ఉంది. 2019 ఎన్నికల్లో మాత్రం అనకాపల్లిలో వైసీపీ వేవ్ కనిపించింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో.. ఇదే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి.. అవంతి శ్రీనివాసరావుపై ఓటమి చెందారు అమర్నాథ్. ఇక.. మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్‌ ఐటీ శాఖ మంత్రిగా పదవి దక్కింది.

Gudivada Amarnath

Gudivada Amarnath (Pic: FB)

అనకాపల్లిపై ఫోకస్ తగ్గించిన అమర్నాథ్
అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలో గెలవడం.. మంత్రి పదవి కూడా దక్కడంతో.. అమర్నాథ్ ఈ నియోజకవర్గంలోనే స్థిరపడతారని పార్టీ క్యాడర్ బలంగా నమ్మింది. అందుకు తగ్గట్లుగానే.. మంత్రి ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టారు. కానీ.. అన్నీ అనుకూలిస్తే.. పొరుగున ఉన్న యలమంచిలి నుంటి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరు, ఎవరికి వారే అన్నట్లుగా ఉండటంతో.. అమర్నాథ్ అనకాపల్లిపై ఫోకస్ తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. పైగా.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం విషయంలోనూ మంత్రికి.. అత్తెసరు మార్కులే పడ్డాయని కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దాంతో.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిలో బరిలోకి దిగబోయేది ఎవరనే చర్చ మొదలైంది. అమర్నాథ్ గనక.. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. అనకాపల్లి టికెట్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao) కుటుంబానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కానీ.. ఎన్నికల నాటికి ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి.. అధిష్టానం ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏవీ వర్కవుట్ కాకపోతే.. మళ్లీ అమర్నాథ్‌నే పోటీ చేయించే అవకాశం కూడా ఉందని.. మరో టాక్ వినిపిస్తోంది.

Also Read: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

Peela Govinda Satyanarayana

Peela Govinda Satyanarayana (Pic: FB)

తెలుగుదేశంలో కొత్త లెక్కలు
వచ్చే ఎన్నికల్లో.. అనకాపల్లి టికెట్ గవర సామాజికవర్గానికి ఇస్తారనే ప్రచారంతో.. దాడి వీరభద్రరావు యాక్టివేట్ అవుతున్నారు. మరోవైపు.. తెలుగుదేశంలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ (Peela Govinda Satyanarayana), మాజీ ఎమ్మెల్సీ, అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ నాగ జగదీశ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దాంతో.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్యాప్ తీసుకొని.. పీలా తన వ్యాపారాలపై దృష్టి సారిస్తే.. అనకాపల్లి సెగ్మెంట్‌లో పార్టీని సమన్వయం చేయడం, వైసీపీ దూకుడుని ఎదుర్కోవడంలోనే తానే ముందున్నానని నాగ జగదీశ్ చెప్పుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డ తనకే.. అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. పీలా గోవింద్ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి మరీ కలిసొస్తున్నారు. మార్నింగ్ కాఫీ విత్ క్యాడర్ పేరుతో.. ఓ ప్రోగ్రాం కూడా మొదలుపెట్టారు. దాంతో.. నాగ జగదీశ్, పీలా గోవింద్ మధ్య నెలకొన్న అంతర్యుద్ధం గనక ముదిరితే.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదనే టాక్ క్యాడర్‌లో వినిపిస్తోంది. ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను.. తెలుగుదేశం, వైసీపీ బరిలో దించితే.. హోరాహోరీ పోరు తప్పదంటున్నారు. అలాంటప్పుడు.. టికెట్ దక్కని వర్గం.. అవతలి వర్గానికి సహకరిస్తుందా? దెబ్బతీస్తుందా? అనే.. చర్చ జరుగుతోంది.

Also Read: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

Paruchuri Baskar Rao

Paruchuri Baskar Rao (Pic: FB)

కీలకంగా జనసేన స్టాండ్ 
మరోవైపు.. అనకాపల్లిలో జనసేన (Janasena) స్టాండ్ కీలకంగా మారుతోంది. పవన్ పార్టీ ఈసారి గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఉందని.. తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు గోవింద్, నాగ జగదీశ్ రాజీ పడితే తప్ప.. లోకల్‌లో పొలిటికల్ సీన్ మారదనే వాదన ఉంది. కానీ.. ఇద్దరు నేతలు అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెనక్కి తగ్గితే.. భవిష్యత్‌లో మళ్లీ చాన్స్ వస్తుందో.. రాదోననే.. ఆందోళనలో ఉన్నారు. ఇదే సమయంలో.. టీడీపీలో నేతల మధ్య కుమ్ములాటలను వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. అసంతృప్తులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు.. జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరితే మాత్రం.. పవన్ పార్టీ సపోర్టు తమకే ఉంటుందని.. టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. కానీ.. జనసేన నుంచి పోటీ చేసేందుకు పరుచూరి భాస్కరరావు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి.. ఓడిపోయారు. ఈసారి కూడా పోటీకి ఏమాత్రం అవకాశం ఉన్నా.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే.. పొత్తు ఉన్నా.. లేకున్నా.. సీటు తనకేననే ధీమాతో ఉన్నారు పరుచూరి భాస్కరరావు.

Also Read: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

అనకాపల్లి నియోజకవర్గం(Anakapalli Constituency)లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. ప్రభుత్వాలు మారుతున్నా.. వాటికి పరిష్కారం దొరకడం లేదు. దాంతో.. జనంలోనూ కొంత అసహనం కనిపిస్తోంది. తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం, క్వారీల నుంచి వస్తున్న కాలుష్యం, బెల్లం మార్కెట్ నిర్వీర్యం కావడం, అనకాపల్లి ఆస్పత్రి అభివృద్ధికి నోచుకోకపోవడం, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు అభివృద్ధి చేయకపోవడం లాంటివన్నీ.. ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలకు సవాళ్లుగా మారనున్నాయి. వీటన్నింటిని అధిగమించి.. అనకాపల్లి ఓటర్లను ఆకర్షించి.. వాళ్లను ఒప్పించి.. మెప్పించి.. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది.. ఆసక్తి రేపుతోంది.