Kethireddy: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Kethireddy: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

Kethireddy, Paritala Sreeram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ కు టీడీపీ టిక్కెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ధర్మవరం(Dharmavaram) వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిటాల శ్రీరామ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు కేతిరెడ్డి. గ్రౌండ్ వర్క్ చేసుకో, వాస్తవాలు ఏంటో తెలుసుకో, ఎవరో చెప్పినవి వినద్దు అంటూ సలహా కూడా ఇచ్చారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో ముగిసింది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని లోకేశ్ ప్రకటించారు.

తనపై నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన ఆరోపణల మీద ఎమ్మెల్యే కేతిరెడ్డి (Kethireddy) ఘాటుగా స్పందించారు. ‘నా పేరుతో భూములు కబ్జా చేసి ఉంటే వారిని చెప్పుతో కొట్టండి. అది అబద్ధమని తేలితే మిమ్మల్ని దేనితో కొట్టాలి? ఊర్లో ఉన్న భూములన్నీ నావే అంటూ లోకేశ్ చెబుతున్నారు. ముందు చెరువు కబ్జా అన్నారు.. తర్వాత 45 ఎకరాలు అన్నారు. 2014 గూగుల్ మ్యాప్ చూపించి నమ్మించాలని చూశారు. ముదిగుబ్బలో నా అనుచరులు కబ్జా చేసి ఉంటే.. వారు ఎక్కడైనా సంతకం పెడతారు. ఆ భూములు మీరే తీసుకోండి. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బోర్డులు పెట్టించిందే నేను. నా పేరు ఎక్కడైనా ఉపయోగిస్తే ఈడ్చి కొడతానని బహిరంగంగా చెప్పాను.

Also Read: చంద్రబాబుకి దరిద్రం పట్టుకుంది.. వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా?: అంబటి

ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలో లోకేశ్ రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు గొడవలు పడితే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? పాదయాత్రలో ఎప్పుడైనా ప్రజా సమస్యలను ప్రస్తావించారా.. ప్రజల వద్దకు వెళ్లారా? మాట అంటే డ్రాయర్లతో నిల్చో బెడతా బట్టలిప్పి కొడతా అంటారు. తన తాత ఖర్జూర్ నాయుడు అని చెప్పుకోకుండా ఎన్టీఆర్ అని చెప్పుకుంటున్నారు. తనకు ఎన్టీఆర్ గొంతు పడిందని కామెడీ చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్(Paritala Sreeram) ఏమైనా కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి వచ్చారా? వారు అనంతపురం, రాప్తాడులో చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుస’ని కేతిరెడ్డి అన్నారు.

Also Read: గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్