Ugadi 2026 Pooja Rituals: ఉగాది పండగ నాడు ఏ దేవుడిని పూజించాలి.. పచ్చడి ఎప్పుడు తినాలంటే..!
Ugadi 2026 Pooja Rituals: ఉగాది పండగకు ఏ దేవుడిని పూజించాలి.. పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలి అనే వివరాలు..
Ugadi 2026 Which God Should Be Worshipped and When to Eat Pachadi
Ugadi 2026 Pooja Rituals : మిగతా ప్రపంచానికి నూతన సంవత్సరం అంటే జనవరి 1. కానీ, కొన్ని దేశాలు వాటి వాటి ఆచారాలకు అనుకూలంగా వేర్వేరు తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. అలాగే తెలుగు వారికి కొత్త సంవత్సరం అంటే ఉగాది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తొలి రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నామని చెబుతారు. అయితే హిందువులు జరుపుకునే పండగల్లో చాలా వరకు ఒక్కో పండగకు ఒక్కో దేవుడిని ఆరాధిస్తారు. వినాయక చవితికి వినాయకుడు, దసరాకు అమ్మవారు, మహా శివరాత్రికి శివుడు ఇలా.. మరి ఉగాది పండగకు ఏ దేవుడిని పూజించాలి? పండగ నాడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఉగాది పచ్చడిని ఏ సమయంలో తినాలి? అనే వాటి గురించి పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి:
ఉగాదికి పూజించాల్సిన దేవుడు
- వినాయక పూజ: సాధారణంగా మనం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. కాబట్టి, ఉగాది నాడు కూడా ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కాల పురుషుడిని ఆరాధించాలి.
- కాల పురుషుడి ఆరాధన: కాల పురుషుడిని ఆరాధించడానికి సులభమైన మార్గం “పురుష సూక్తం” పఠించడం. ఒకవేళ వేద మంత్రాలు రాని వారు లేదా చదవలేని వారు “విష్ణు సహస్రనామము” పఠించవచ్చు. ఉగాది పండగ నాడు విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా.. ఆ కాల పురుషుడి అనుగ్రహం పొంది సంవత్సరం అంతా శుభం కలుగుతుంది.
పండగ నియమాలు
ఉగాది నాడు తెల్లవారుజామునే కాకుండా.. అమావాస్య గడియలు దాటిన తర్వాత, అంటే మార్చి 19, ఉదయం 7:00 గంటల తర్వాత తైలాభ్యంగన స్నానం చేయాలి. కొత్తవి లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అయితే నలుపు రంగు దుస్తులు మాత్రం ధరించకూడదు.
ఉగాది పచ్చడి తినే సమయం
ఉగాది పండగ నాడు ఉదయం 11:15 నుండి 12:00 గంటల మధ్య సమయంలో ఉగాది పచ్చడి సేవించడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుందంటున్నారు పండితులు.
సాయంత్రం వేళ
సాయంత్రం శివాలయ దర్శనం చేసి, పార్వతీ పరమేశ్వరులకు ధవనంతో అర్చన చేయించడం వల్ల ఏడాది పొడవునా వారి అనుగ్రహం ఉంటుందని పండితులు తెలిపారు.
గమనిక : పాఠకుల ఆసక్తి మేరకు ఈ సమాచారం ఇవ్వడమైనది. దీనికి శాస్త్రీయ నిర్ధారణ లేదు.
