Open Auction To Tahsildar Rdo Office In Kurnool District
Tahsildar & RDO Office : ఆర్డీఓ, తహసీల్దార్ అంటే అక్కడ సర్వాధికారాలు వారివే. ఆ మండల స్థాయి మెజిస్ట్రేట్‌లు కూడా వారే. అటువంటి వారికి షాకిచ్చింది కోర్టు. వారి ఆఫీసులు నిర్మించిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో.. ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులను అమ్మేందుకు కోర్టు వేలం వేయనుంది.
ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు చెల్లించలేదంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కడంతో.. ఆఫీసులు వేలం వేసి అయినా డబ్బు కట్టాల్సిందేనంటూ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. దీంతో.. నంద్యాల తహశీల్దారు కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం వేలం నిర్వహించనున్నట్లు దండోరా వేసి ప్రకటించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
1988లో కర్నూలు జిల్లాలో స్పిన్నింగ్ మిల్లును మోహన్ రావు అనే కాంట్రాక్టర్ నిర్మించారు. దానికి 95లక్షల రూపాయలు ఖర్చు కాగా.. దాన్ని అప్పటి స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ చెల్లించలేదు. ఎంత తిరిగినా డబ్బులు చెల్లించకపోవడంతో.. కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018లో దానిపై తీర్పు చెప్పిన నంద్యాల కోర్టు తహసీల్ధార్, ఆర్డీఓ ఆఫీసులను జప్తు చేయాలని తీర్పు వెల్లడించింది. అప్పటి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ.. బాధితుడికి ఆ డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేశారు.
ఎంత తిరిగినా న్యాయం జరగకపోవడంతో.. మళ్లీ కోర్టు మెట్లెక్కారు కాంట్రాక్టర్ మోహన్ రావు.
చివరికి నంద్యాల కోర్టు ఈ నెల 24న రెండు కార్యాలయాలను వేలం వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొదట్లో 95లక్షల రూపాయలుగా ఉన్న చెల్లించాల్సిన ధర ఇప్పడు 18శాతం వడ్డీతో కలిపి 75 కోట్ల రూపాయలు అయ్యింది. అక్కడ జరిగే వేలం పాటలో భూమి కావాల్సిన వారు పాల్గొనవచ్చని అంటున్నారు మోహన్ రావు తరఫున న్యాయవాది. మొత్తానికి ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు వేలం వేయాలంటూ కోర్టు నోటీసులు ఇవ్వడం.. దానికి దండోరా కూడా వేయించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read More : CM Jagan Visakhapatnam : త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన