లేఖ పెట్టిన చిచ్చు : 30 ఏళ్లు విశాఖలో విమానాశ్రయాన్ని మూసేయండి

  • Publish Date - November 20, 2020 / 11:40 PM IST

Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే… అంతే ఘాటుగా కౌంటరిచ్చింది వైసీపీ. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నాం.. అక్కడ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి 30 ఏళ్లపాటు విశాఖలో పౌర విమానాశ్రయాన్ని మూసేయండి. పౌర విమానయాన శాఖా మంత్రి హరదీప్‌సింగ్‌ పూరీ ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ప్రతిపాదన. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన విజయసాయిరెడ్డి.. దీనికి సంబధించి లేఖ కూడా ఇచ్చారు.



విపక్షాల మధ్య మాటల యుద్ధం :-
ఇదే లేఖ ఇప్పుడు ఏపీలో అగ్గి రాజేసింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భోగాపురంలో ఇంకా విమానాశ్రయం శంకుస్థాపనే జరగలేదని.. ఈ సమయంలో… కేంద్రానికి లేఖ ఎలా రాస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎవరి లబ్ధి కోసం కేంద్రమంత్రికి లెటర్ రాశారని నిలదీసింది.
అటు జనసేన కూడా ఈ లేఖపై ఘాటుగానే స్పందించింది. విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలనే ప్రతిపాదనను ఖండిస్తున్నామన్నారు జనసేన నేతలు. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే విశాఖ వాసులు ఊరుకోబోరని హెచ్చరించారు.



కౌంటర్ ఇచ్చిన ఎంపీ విజయసాయి :-
అయితే… విపక్షాల విమర్శలకు కౌంటరిచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ ఎయిర్ పోర్ట్ నేవీకి చెందినదని, కేంద్రానిది కాదన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని నేవికి అప్పగిస్తామన్నారు. టీడీపీ, వైసీపీ విమర్శలపై విరుచుకుపడ్డారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి కోసం ఏకంగా 30 ఏళ్లు పౌర విమానాశ్రయాన్ని మూసేయాలని కోరడం ఏంటనే వాదన వినిపిస్తోంది. ఒక సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, మరొకటి మూసేయడం తగదని, రెండూ కొనసాగించాలనే ప్రతిపాదన వినిపిస్తోంది.