Payyavula Keshav : జగన్ తన తప్పు అంగీకరించినట్లే, కొత్త బిల్లుతో మరింత కన్‌ఫ్యూజన్

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు.

Payyavula Keshav : మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు. కాగా, మూడు రాజధానుల రద్దు నిర్ణయం మరింత అనిశ్చితికి దారి తీస్తుందని పయ్యావుల హెచ్చరించారు. మళ్లీ మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన ప్రకటనతో మరింత అనిశ్చితి నెలకొంటుందన్నారు. కోర్టులో వాదనలు కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని కేశవ్ గుర్తుచేశారు. అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

మూడు రాజధానులపై మరో కొత్త బిల్లు తీసుకొస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడాన్ని పయ్యావుల తప్పుపట్టారు. మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం తప్పదన్నారు. మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాధ్యులు ఎవరని సీఎం జగన్ ను పయ్యావుల ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో వైసీపీ సర్కార్ చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించినట్లేనని పయ్యావుల అన్నారు.

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు పేరుతో పలు తప్పిదాలు చేసిందని, ఇప్పుడు కొత్త బిల్లు పేరుతో మరింత గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పయ్యావుల ఆరోపించారు. ఇలాంటి తప్పిదాల వల్ల రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

రాజధాని అంశంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేశారు. అయితే, ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని తెలిపారు.

హైదరాబాద్ వంటి సూపర్ మోడల్ సిటీ వద్దే వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి పాల్పడరాదన్న అభిప్రాయాలను బలపరుస్తూ 2019లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాతీర్పును బలంగా నమ్మి వికేంద్రీకరణ దిశగా అడుగులు ముందుకు వేశామని చెప్పారు. రకరకాల అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, అందుకే తాము బిల్లు ఉపసంహరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. కొందరికి అన్యాయం జరుగుతుందన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని జగన్ స్పష్టం చేశారు. అయితే అమరావతి అభివృద్ధికి గతం ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం కేవలం మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు కావాలని అన్నారు. ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు ఎంత కావాల్సి ఉంటుందని ప్రశ్నించారు. కానీ వాస్తవ పరిస్థితిలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక వసతులకే డబ్బు లేకపోతే రాజధాని ఊహాచిత్రం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే

ప్రస్తుతానికి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు రాజధానులపై తమ నిర్ణయం మారదని, ఈ బిల్లును మరింత మెరుగుపరిచి, సమగ్రమైన బిల్లుగా ముందుకు తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు సంపూర్ణంగా వివరించేలా బిల్లును నవీకరిస్తామని తెలిపారు. కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సందేహాలకు ఈ కొత్త బిల్లు ద్వారా సమాధానమిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు