Kadapa Mayor
Kadapa Mayor : కడప మేయర్‌గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేశ్ ఎన్నికయ్యారు. సురేశ్ ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కడప నగర మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. గురువారం కడప మేయర్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. కోర్టు తీర్పుతో ఎన్నిక అనివార్యం కావడంతో నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కేఎంసీ కార్యాలయానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం 11గంటలకు జేసీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
కడప నగర మేయర్ ఎన్నికలో టీడీపీ తరపున బరిలో నిలవడం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ముందుగానే ప్రకటించారు. దీంతో వైసీపీ అభ్యర్థి మేయర్ గా ఎంపిక కావడంతో.. వైసీపీ కార్పొరేటర్లు 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేశ్ ను ఏకగ్రీవంగా కడప మేయర్ గా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతిచెందారు.ప ఒకేఒక్క కార్పొరేటర్ మాత్రమే జి.ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47మంది వైసీపీ కార్పొరేటర్లలో ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీకి 39మంది కార్పొరేటర్లు ఉన్నారు.
హైకోర్టు కడప మేయర్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాకా సురేశ్ ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో సురేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.