AP Cabinet Expansion : అదృష్టం అంటే అప్పలరాజుదే

  • Publish Date - July 22, 2020 / 11:33 AM IST

అదృష్టం అంటే అప్పలరాజుదే.. తొలిప్రయత్నంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఏడాది పూర్తికాగానే మంత్రి పదవి చేపడుతున్నారు. యువ ఎమ్మెల్యేగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన అప్పలరాజు మంత్రిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పనున్నారు.

సిదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో జన్మించారు. మధ్యతరగతి మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పలరాజు పదో తరగతి నుంచి మెరిట్‌ మార్కులు సాధించడంతో ప్రైవేటు విద్యాసంస్థలకు ఆయనకు చేయూతనిచ్చాయి. టెన్త్‌క్లాస్‌ లో స్టేట్‌ ఫోర్త్‌ ర్యాంక్ సాధించారు.

ఇంటర్‌ గాజువాకలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదివారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివారు. ఎంబీబీఎస్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ చదివారు.

2007లో విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి, ఆంధ్రామెడికల్ కాలేజీలో ఏడాదిపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు అప్పలరాజు. తర్వాత పలాసలో సేఫ్‌ హాస్పిటల్ పేరుతో సొంతంగా క్లినిక్‌ ప్రారంభించి వైద్య సేవలందించారు. అప్పలరాజు 2017 ఏప్రిల్‌లో రాజకీయాల్లోకి వచ్చారు. పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి పోటీ చేశారు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలుపొందారు. అప్పలరాజుకు సామాజికవర్గం కలిసివచ్చింది. సీఎం జగన్ మండలిని రద్దు చేయాలనుకోవడం.. మోపిదేవిని రాజ్యసభకు పంపడం అప్పలరాజుకు కలిసొచ్చింది. మోపిదేవి సామాజికవర్గానికే చెందిన అప్పలరాజును అదృష్టం వరించింది. జగన్ కేబినెట్‌లో చోటు దక్కేలా చేసింది.

సిదిరి అప్పలరాజుకు వాక్‌చాతుర్యం కూడా ఆయనను అందలం ఎక్కించిందనే చెప్పవచ్చు. అసెంబ్లీలో ఆయన చేసిన తొలి ప్రసంగం జగన్‌ను ఆకట్టుకుందని.. అప్పటినుంచి అప్పలరాజుకు పార్టీలో ప్రాధాన్యతపెరిగిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అటు విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఏర్పాటు చేస్తుండటంతో ఉత్తరాంధ్ర నుంచి యువకుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటే బెటర్‌ అని సీఎం జగన్‌ భావించారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు