Panchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీనిపై జగన్ సర్కార్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్నా… అమ్మఒడి రెండోవిడత కార్యక్రమానికి సర్కార్ రెడీ అయిపోయింది. నేడు నెల్లూరులో సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజు రోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై నేడు పూర్తి స్థాయిలో విచారించనుంది. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికలకు సహకరించలేమని మరోపక్క ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్తున్నాయి.
మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై స్పందించిన ఎన్నికల కమిషన్.. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని సూచించింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని.. సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీడ్ల్‌లు సరఫరా చేస్తామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. వ్యాక్సినేషన్‌లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, ఏపీ ఉద్యోగాలకు సాటిరారని చెప్పారు.
ఇప్పటికే ఏపీలో ఎన్నికల కోడ్‌పై ఈసీ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 9 నుంచి ఫిబ్రవరి 17వరకు కోడ్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి సహా అన్ని పథకాలను ఆపాలని, ఈ పథకాలన్నింటికి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని పేర్కొంది. అధికారులు, సిబ్బంది బదిలీలపై నిషేధం కూడా విధించింది. అయితే అమ్మ ఒడికి ఎన్నికల కోడ్ వర్తించదన్న ఏపీ ప్రభుత్వం… ఆ పథకం ప్రారంభానికి వడివడిగా అడుగులు వేస్తోంది.
నేడు నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి లోబడే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్. మొత్తానికి ఏపీలో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. నువ్వా-నేనా అన్నట్లు ప్రభుత్వం, ఈసీ సై అంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల అంశంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.