Pawan Kalyan Campaigning On Behalf Of Bjp Candidate In Tirupati Today
Pawan Kalyan election campaigning : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్త అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న రత్నప్రభ గెలుపు కోసం పవన్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మార్‌పల్లి కూడలికి పవన్ చేరుకుంటారు.
ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో దీని కోసం ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారు.
జనసేనానితో కలిసి వాళ్లంతా పాదయాత్రలో పాల్గొని రత్నప్రభను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని ఇరుపార్టీల నాయకులు భావిస్తున్నారు.