Pawan Kalyan
Pawan Kalyan: వారాహి యాత్రలో దారిపొడవునా జూ.ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, రజినీకాంత్ ఫ్లెక్సీలను అభిమానులు పట్టుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆ హీరోలంటే తనకూ అభిమానమేనని, ఇది శుభపరిణామమని తెలిపారు.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రజినీకాంత్ లాంటి పెద్ద మనిషిని కూడా వైసీపీ వదల్లేదని, ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. తాను ఓడిపోయినా నిలబడే ఉన్నానని, ప్రభుత్వాన్ని స్థాపించే వరకూ నిలబడే ఉంటానని తెలిపారు.
ఓట్లు చీలకూడదంటే గతంలో విభేదించినా కలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2014లో తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది అని తాు అనుకోలేదని, ఆ పార్టీకి అండగా నిలబడ్డాను అనుకున్నానని తెలిపారు. ఏపీ కోసం పదేళ్ల పాటు టీడీపీ-జనసేన కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2014లో కలిసినట్టు 2024లోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలవాలని బీజేపీ అగ్ర నాయకులకు చెప్పానని తెలిపారు.
కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం బీజేపీ అగ్రనాయకులు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క అడుగు వెనక్కి వెయ్యడానికి తాను సిద్ధమేనని చెప్పారు. ప్రజల కోసం తన వ్యక్తిగత లాభాన్ని పక్కన పెట్టానని తెలిపారు. తనకు సీఎం పదవి కంటే ఏపీ భవిష్యత్తు ముఖ్యమని చెప్పారు.